- మూడు సీజన్ల బకాయిలు రూ.45 కోట్లు
- గన్నీ బ్యాగ్‌ల షార్టేజ్ పేరుతో పైసల కటింగ్
నిజామాబాద్, వెలుగు : వడ్ల కొనుగోలు సెంటర్లకు మూడు సీజన్ల కమీషన్ ఇంకా చెల్లించలేదు. దీంతో కాంటాలు పెట్టి ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసిన సింగిల్ విండోలు, ఐడీసీఎంఎస్, మెప్మా తదితర సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సీజన్ ముగియగానే చెల్లించాల్సిన కమీషన్ రకరకాల కొర్రీలు పెడుతూ అధికారులు పెండింగ్ పెడుతున్నారు. 2023–-24 ఖరీఫ్, యాసంగి సీజన్ల కమీషన్‌తో పాటు ముగిసిన 2024–-25 వానాకాలం సీజన్ సొమ్ము అందాల్సి ఉంది.
ప్రతి సీజన్‌కు కనీసం రూ.15 కోట్లు
జిల్లాలో వరి సాగు విస్తీర్ణం ఏటా పెరిగి 4.20 లక్షల ఎకరాలకు చేరింది. ప్రతి సీజన్‌కు సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది. ఇందులో కొంత భాగాన్ని మిల్లర్లు కొనగా సర్కారు పక్షాన కొనుగోళ్లు చేయడానికి సెంటర్లు ఏర్పాటు చేస్తారు. రైతులకు గిట్టుబాటుధర కల్పించడంతోపాటు సెంటర్ల నిర్వహించే సింగిల్ విండోలు,మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటును అందించడం కోసం సెంటర్లను ఏర్పాటు చేశారు. సింగిల్ విండోలకు క్వింటాల్‌కు రూ.32 కమీషన్ రూపంలో ఇస్తారు. మెప్మా, రైతు సహకార సంఘాలకు కూడా కొన్ని సెంటర్ల నిర్వహణ అప్పగిస్తున్నారు.
సీజన్ ముగియగానే వడ్ల కొనుగోలు లెక్కలు చూసి కమీషన్ చెల్లించాలి. కానీ, గత మూడు సీజన్ల నుంచి అలా జరుగడంలేదు. 2023–-24 వానాకాలం 482 సెంటర్లు ఏర్పాటు చేసి 3.90 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో సీజన్లో 467 కేంద్రాలు ఏర్పాటు చేసి 3.92 లక్షల టన్నుల ధాన్యం సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ వడ్లు కొనుగోలు చేసింది. ప్రతి సీజన్ కమీషన్ రూ.15 కోట్ల చొప్పున సెంటర్ నిర్వాహకులకు అందాలి. 2024–-25 ఖరీఫ్‌లో 579 సెంటర్ల ద్వారా సుమారు 4 లక్షల టన్నుల వడ్లు సివిల్ సప్లయ్ సేకరించింది. ఈ కమీషన్ కూడా రూ.15 కోట్ల దాకా ఉంది.
వెరసి మూడు సీజన్లకు చెందిన రూ.45 కోట్ల కమీషన్ బకాయిలు రిలీజ్ కావడంలేదు. సెంటర్ల నిర్వహణలో సింగిల్ విండోలు 90 శాతం బిజినెస్ చేయగా ఐడీసీఎంఎస్, మెప్మా, రైతు సంఘాలు కలిసి పది శాతం కొనుగోళ్లు చేస్తాయి. కమీషన్ రూపంలో ఒక సీజన్‌కు రూ.16 లక్షలు సంపాదించే సింగిల్ విండోలు జిల్లాలో ఉన్నాయి. ఈ సొమ్ము చెల్లింపులో జరుగుతున్న జాప్యం వల్ల సింగిల్ విండోల ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతున్నాయి.
వడ్ల కాంటాలు పెట్టే టైంలో సివిల్ సప్లయ్ అధికారులు ఇచ్చిన కొత్త గన్నీ బ్యాగుల షార్టేజ్ వస్తే కొనుగోలు సెంటర్ల నిర్వాహకులకు కమీషన్లో రూ.60, పాత బ్యాగ్‌లకు రూ.40 కోత పెడుతున్నారు. సీజన్లో తమకు అందేనాటికే బ్యాగ్‌లు తక్కువగా ఉంటున్నాయని దానికి తమను బాధ్యులను చేయడం కరెక్ట్ కాదని సింగిల్ విండో సెక్రటరీలు అంటున్నారు.
సింగిల్ విండోల ఇన్కమ్ కోసం..
ఉమ్మడి జిల్లాలో 141 సింగిల్ విండోలు ఉండగా వాటిలో కామారెడ్డిలో 54, నిజామాబాద్ జిల్లాలో 87 నడుస్తున్నాయి. వ్యవసాయ సంబంధమైన సేవలు అన్నదాతలకు అందించడానికి వీటిని ఏర్పాటు చేశారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు రైతులకు అమ్మడంతో పాటు డీసీసీబీ బ్యాంకు నుంచి పంట రుణాలు, షార్ట్, లాంగ్ టర్మ్ లోన్లు మంజూరు చేయడంలో సింగిల్ విండోలు కీలక పాత్ర పోషిస్తాయి.
ఇన్కమ్ యాక్టివిటీ రెగ్యూలర్‌గా ఉంటేనే వాటి మనుగడకు ఢోకా ఉండదు. రూ.కోట్లలో పేరుకున్న కమీషన్ బకాయిలు సింగిల్ విండోలతో పాటు వడ్ల కొనుగోలు సెంటర్లు నిర్వహించిన ఇతర సంస్థలకు ఇబ్బందిగా మారింది.
డబ్బు రిలీజ్ కావాల్సి ఉంది
వడ్ల కొనుగోలు సెంటర్లు నిర్వాహకుల కమీషన్ పైసలు ప్రభుత్వం నుంచి రిలీజ్ కావాల్సి ఉంది. నేను చార్జ్ తీసుకున్నాక బకాయిల రిపోర్టు పంపాను. ఆ డబ్బు
రాగానే పేమెంట్ చేస్తం.
– అంబాదాస్ రాజేశ్వర్, డీఎం, సివిల్ సప్లయ్