పార్లమెంట్ ఎన్నికల కమిటీలో మెదక్ నుంచి ముగ్గురికి చోటు

పార్లమెంట్ ఎన్నికల కమిటీలో మెదక్ నుంచి ముగ్గురికి చోటు

సంగారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ హై కమాండ్ సోమవారం ప్రకటించిన పార్లమెంట్ ఎన్నికల రాష్ట్ర కమిటీలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ముగ్గురికి ప్రాధాన్యం లభించింది. రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో  ప్రకటించిన ఎన్నికల కమిటీలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తోపాటు మాజీమంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి చోటు కల్పించింది.

అయితే ఈ కమిటీకి చైర్మన్ గా పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తారు. ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ముగ్గురికి పార్లమెంట్ ఎన్నికల కమిటీలో చోటు కల్పించడం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. రెండు పార్లమెంట్ పరిధిలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు, బీఆర్ఎస్ ఏడు స్థానాలు దక్కించుకున్నాయి. ఈ పరిస్థితుల్లో జహీరాబాద్, మెదక్ రెండు పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా మారాయి.