పరీక్షల ఒత్తిడితో విద్యార్థి సూసైడ్!

పరీక్షల ఒత్తిడితో విద్యార్థి సూసైడ్!
  • మరోచోట మహిళ, బస్సు కండక్టర్ కూడా.. 

చందానగర్, వెలుగు: సిటీలో వేర్వేరు చోట్ల  ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. చందానగర్​లో పరీక్షల ఒత్తిడితో స్టూడెంట్ ఉరేసుకొని మృతి చెందాడు. నెహ్రూనగర్​కు చెందిన రాజేశ్వరికి ఇద్దరు పిల్లలు. తన భర్త చనిపోవడంతో కేర్​టేకర్​గా పనిచేస్తూ బిడ్డలను చదివిస్తున్నది. ఆమె పెద్దకొడుకు దీక్షిత్​రాజ్​(17) చందానగర్​లోని ఓ కాలేజీలో ఇంటర్ ​సెకండియర్ ​చదువుతున్నాడు. త్వరలో పరీక్షలు ఉండడంతో ఇంట్లోనే ఉంటూ చదువుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం తల్లి పనికి వెళ్లగా, సాయంత్రం తిరిగొచ్చేసరికి దీక్షిత్ బెడ్రూంలో ఉరేసుకొని కనిపించాడు.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పరీక్షలు ఉండడంతో దీక్షిత్​ వారం రోజులుగా డిప్రెషన్​కు గురవుతున్నాడని, ఆ ఒత్తిడితోనే సూసైడ్​ చేసుకోవచ్చని మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

కేపీహెచ్​బీ కాలనీలో మహిళ..

కూకట్ పల్లి: కేపీహెచ్​బీ కాలనీలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మృతి చెందింది. కేపీహెచ్​బీ ఎలిగెంట్​అపార్ట్​మెంట్​ఫ్లాట్​నంబర్​204లో పూజశ్రీ (31), బండ్ల సునీల్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ ప్రైవేటు ఉద్యోగులుగా పనిచేస్తుండగా, శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో పూజశ్రీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని మృతి చెందింది. ఈ ఘటనపై కేపీహెచ్​బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యాచారంలో బస్సు కండక్టర్..

ఇబ్రహీంపట్నం: యాచారం పరిధిలో ఆర్టీసీ బస్సు కండక్టర్ పురుగుల మందు తాగి మృతి చెందాడు. యాచారం మండలం గాండ్ల గూడెంకు చెందిన కోరే అంజయ్య(45) ఇబ్రహీంపట్నం డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్నాడు. అనారోగ్యంతో మనస్తాపానికి గురై  15 రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి ట్రీట్మెంట్ తీసుకున్నాడు.

 అప్పటి నుంచి కండక్టర్ లీవ్​లో ఉండగా, 27కు పూర్తయింది. దీంతో గురువారం మరోసారి ఊరికి దూరంగా వెళ్లి పురుగుల మందు తాగాడు. బాధిత కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.