దేశాల సక్సెస్ మంత్రాన్ని వివరించిన ముగ్గురు ఆర్థికవేత్తలకు నోబెల్

 దేశాల సక్సెస్ మంత్రాన్ని వివరించిన ముగ్గురు ఆర్థికవేత్తలకు నోబెల్
  • డారన్ ఎసిమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఎ. రాబిన్సన్ లకు అవార్డు
  • ప్రజాస్వామ్య సంస్థలు బాగున్న దేశాలే 
  • ఆర్థికంగా ఎదుగుతాయని వివరించిన ఆర్థికవేత్తలు 
  • దేశాల అభివృద్ధికి చక్కటి మార్గం చూపారని నోబెల్ కమిటీ ప్రశంసలు

స్టాక్​హోం(స్వీడన్): ప్రపంచంలో కొన్ని దేశాలు సంపన్నంగా మారుతుంటే.. మరికొన్ని దేశాలు ఆర్థిక వృద్ధి సాధించలేక వెనకబడుతూ ఉండటానికి కారణాలను వివరించిన ముగ్గురు ఆర్థికవేత్తలకు ఈ ఏడాది ఎకనమిక్స్ లో నోబెల్ ప్రైజ్ లభించింది. టర్కిష్ అమెరికన్ డారన్ ఎసిమోగ్లు(57), బ్రిటిష్ అమెరికన్ సైమన్ జాన్సన్ (61), బ్రిటిష్ ఎకనమిస్ట్ జేమ్స్ ఎ. రాబిన్సన్(64)లను ఈ ఏడాది ఆర్థిక నోబెల్ కు ఎంపిక చేసినట్టు సోమవారం రాయల్ స్వీడిష్ అకాడమీ నోబెల్ కమిటీ ప్రకటించింది. ‘‘ప్రజాస్వామ్య సంస్థలు, సామాజిక సంస్థలు బలంగా ఉన్న దేశాలే సుసంపన్న దేశాలుగా మారతాయి. బలహీనమైన సంస్థలు, చట్టాలు ఉన్న దేశాలు మాత్రం ఆర్థికంగా వెనకబాటుకు గురవుతాయి” అని వీరు ముగ్గురూ తమ రీసెర్చ్ ద్వారా నిరూపించారని కమిటీ ప్రశంసించింది. ‘‘ఆయా దేశాల మధ్య ఆదాయ వ్యత్యాసాలను తగ్గించడం అనేది సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పెను సవాలుగా మారింది. అయితే, ఈ సవాలును ఎదుర్కోవడంలో ప్రభుత్వ, మతపరమైన, ఇతర సామాజిక సంస్థల స్థితిగతులే ప్రధాన పాత్ర పోషిస్తాయని వీరు నిరూపించారు” అని తెలిపింది. అవార్డు కింద వీరు ముగ్గురికీ మెడల్స్ తోపాటు11 మిలియన్ల స్వీడిష్ క్రోనా(రూ. 8.86 కోట్లు)లను అందజేయనున్నారు.

రెండు సిటీల స్థితిగతులపై విశ్లేషణ.. 

ప్రస్తుతం ఎసిమోగ్లు, జాన్సన్ ఇద్దరూ అమెరికాలోని మసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో.. రాబిన్సన్ యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో రీసెర్చ్ నిర్వహిస్తున్నారు. ఎసిమోగ్లు, రాబిన్సన్ కలిసి ‘‘వై నేషన్స్ ఫెయిల్: ది ఆరిజిన్స్ ఆఫ్ పవర్, ప్రాస్పెరిటీ అండ్ పావర్టీ’ అనే బుక్ రాశారు. ఇది 2012లో విడుదల కాగా, ఆ ఏడాది బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. దేశాలు పేదరికంలో మగ్గిపోవడానికి మానవులు సృష్టించుకున్న సమస్యలే కారణమని వారు ఇందులో వివరించారు. ఉదాహరణకు అమెరికా–మెక్సికో బార్డర్ కు ఇరువైపులా ఉన్న రెండు సిటీల్లోని పరిస్థితులను వీరు ప్రస్తావించారు. అమెరికాలోని అరిజోనా స్టేట్ లో ఉన్న సిటీ ఆఫ్ నోగేల్స్ ఆర్థికంగా అభివృద్ధి సాధించగా.. మెక్సికోలోని సోనోరా స్టేట్ లో ఉన్న నోగేల్స్ సిటీ మాత్రం పేదరికం, నేరాలమయంగా మారింది. ఒకేరకమైన వనరులు, కల్చర్, అవకాశాలు ఉన్నప్పటికీ.. విద్యా సంస్థలు, ప్రజాస్వామ్య, సామాజిక వ్యవస్థలు బలంగా ఉండటం, చట్టాల అమలు వంటివే రెండు సిటీల 
మధ్య వ్యత్యాసానికి కారణమని వీరు వివరించారు. 

నోబెల్ ప్రైజ్ కాకపోయినా.. 

డైనమైట్​ను కనుగొన్న స్వీడిష్ సైంటిస్ట్, బిజినెస్ మాన్ ఆల్ఫ్రెడ్ నోబెల్ 1896 చనిపోగా, ఆయన వీలునామా ప్రకారం 1901 నుంచి ఏటా మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, శాంతి విభాగాల్లో అవార్డులను ప్రకటిస్తున్నారు. ఆర్థిక నోబెల్ నిజానికి నోబెల్ ప్రైజ్ కాదు. దీనిని ఆల్ఫ్రెడ్ నోబెల్ స్మారకార్థం 1968లో స్వీడిష్ సెంట్రల్ బ్యాంకు స్థాపించింది. అధికారికంగా ‘బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ప్రైజ్ ఇన్ ఎకనమిక్స్’గా పిలుస్తారు. అయితే, ఏటా నోబెల్ అవార్డులతో పాటే ప్రదానం చేస్తుండటంతో.. దీనినీ నోబెల్ అవార్డుగా పేర్కొంటున్నారు. కాగా, తాజాగా ఎకనమిక్స్ నోబెల్ విజేతల పేర్ల వెల్లడితో ఈ ఏడాది నోబెల్ అవార్డుల ప్రకటన పూర్తయింది.