
సాధారణంగా ఏవైనా వ్యాధి కారకాలు శరీరంలోకి వస్తే వెంటనే రియాక్షన్ కనిపిస్తుంది. సంబంధిత లక్షణాలు బయటపడతాయి. దాన్నిబట్టి డాక్టర్ సలహా తీసుకుంటాం. కానీ, కిడ్నీల విషయంలో అలా జరగదు. ఎందుకంటే కిడ్నీలు అనారోగ్యానికి గురైతే ప్రత్యేకించి ఒక లక్షణం కనిపిస్తుందని చెప్పలేం. లక్షణాలు కనపడకుండానే లోలోపల వ్యాధి ముదిరిపోతూ ఉంటుంది. లక్షణాలు బయటపడే సమయానికి అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చేస్తుంది. దాంతో కిడ్నీలను కాపాడడం కొన్నిసార్లు కష్టమైపోతుంది. అందుకే కిడ్నీలను హెల్దీగా ఉంచుకోవాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్.
కిడ్నీలు మన ఒంట్లోని వ్యర్థాలు, అదనపు నీటిని బయటకు పంపిస్తాయి. రక్తాన్ని శుద్ధిచేస్తాయి. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి కావాల్సిన హార్మోన్ కిడ్నీ నుంచే వస్తుంది. విటమిన్ – డి చివరి రూపం కూడా కిడ్నీలోనే ఏర్పడుతుంది. తద్వారా ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. శరీరంలో నీటి లెవల్స్‌ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే గుండె తర్వాత బ్లడ్ ప్రెజర్‌ని కంట్రోల్ చేయడంలో కిడ్నీలది కీలక పాత్ర.
సమస్యలు రెండు రకాలు
కిడ్నీ సమస్యలు రెండు రకాలు. ఒకటి తాత్కాలికంగా వచ్చేవి. ఈ కండిషన్లో సడెన్‌గా కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. దానికి కారణాలేంటంటే.. యూరిన్ ఇన్ఫెక్షన్లు, కిడ్నీల్లో రాళ్లు, గుండె జబ్బులు, నిమోనియా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడడం, స్కిన్ ఇన్ఫెక్షన్లు వంటివి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన టైంలో టెస్ట్‌లు చేసి, ట్రీట్మెంట్ అందిస్తే తిరిగి కిడ్నీలను మామూలు స్థితికి తీసుకురావొచ్చు. రెండోది దీర్ఘకాలికంగా ఉండే సమస్యలు. వీటిలో అసలు లక్షణాలే కనపడవు. దీనికి సాధారణ కారణాలు డయాబెటిస్, బీపీ. వీళ్లలో అడ్వాన్స్డ్ స్టేజీలో మాత్రమే కనిపిస్తాయి.
ఈ మూడు పరీక్షలు చాలు
క్రియాటినిన్, అల్ట్రాసౌండ్, యూరిన్ టెస్ట్ అనేవి కిడ్నీ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి చేసే సాధారణ పరీక్షలు. కిడ్నీ హెల్దీగా ఉందా? లేదా? అనేది తెలుసుకోవడానికి క్రియాటినిన్ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్‌లు అన్నిచోట్లా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఇలాంటి టెస్ట్‌లు చేయించుకోవడానికి ముందుకు రావాలి. ఇదే కాకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేస్తారు. ఈ స్కాన్‌లో కిడ్నీలు పరిమాణం, పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది. అలాగే మూత్ర పరీక్ష కూడా చేస్తారు. కొందరికి మూడు పరీక్షలు అవసరమవుతాయి. మరికొందరికి వీటిలో ఏదో ఒక పరీక్షలో సమస్య బయటపడుతుంది. ఖర్చు తక్కువ.
నిజానికి కిడ్నీ సమస్యలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మనదేశంలో ఎక్కువగా బీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు, కిడ్నీల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్లకు గురయ్యే పేషెంట్లలో ఎక్కువగా కిడ్నీ సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి వాళ్లు వెంటనే కిడ్నీ టెస్ట్‌లు చేయించుకోవాలి. దానివల్ల సమస్య పెద్దది కాకుండా, డయాలసిస్ వరకు వెళ్లకుండా ఆపొచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా హెల్దీగా ఉన్నవాళ్లు ఏడాదికొకసారి టెస్ట్‌లు చేయించుకోవాలి.
వీళ్లు టెస్ట్‌లు చేయించుకోవాలి
- ఒక వయసు వచ్చాక అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువ. కాబట్టి అందరూ కిడ్నీల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి.
- ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ సమస్య ఉంటే తర్వాతి తరాలకు వచ్చే ప్రమాదం ఉండొచ్చు.
- డయాబెటిస్, బీపీ, ఒబెసిటీ, గుండె జబ్బులు, కిడ్నీల్లో రాళ్లు ఉన్నవాళ్లు తప్పనిసరిగా కిడ్నీలు టెస్ట్ చేయించాలి.
- పెయిన్ కిల్లర్స్, ప్రిస్క్రిప్షన్ లేకుండా రెగ్యులర్‌గా మందులు వాడేవాళ్లకు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది.
- యూరిన్ ఇన్ఫెక్షన్లు తరచూ వచ్చే వాళ్లకు అలాగే మందు, పొగ తాగే అలవాటు ఉన్నవాళ్లకు కిడ్నీ సమస్యలు వస్తుంటాయి. కిడ్నీ సమస్య నుంచి ఒకసారి బయటపడిన వాళ్లు తర్వాత దాని గురించి పట్టించుకోకపోవడం ప్రమాదకరం.
కిడ్నీలు హెల్దీగా ఉండాలంటే..
ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మేలు. జంక్ ఫుడ్, కొవ్వులు ఎక్కువ ఉండేనూనె పదార్థాలకు దూరంగా ఉండాలి.
శరీరం బరువు పెరగకుండా కంట్రోల్లో ఉంచుకోవాలి. రోజుకి సరిపడా నీళ్లు తాగాలి.కూరగాయలు, ఆకు కూరలు తినాలి. డయాబెటిస్, బీపీ ఉన్నవాళ్లు రెగ్యులర్ చెకప్లతోహెల్త్ని మెయింటెయిన్ చేసుకోవాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టానుసారంగా పెయిన్ కిల్లర్స్ వంటి మందులు రెగ్యులర్‌గా వాడకూడదు.
అవేర్నెస్ కోసం కిడ్నీ డే
కిడ్నీ హెల్త్ గురించి చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల సమస్యను వెంటనే గుర్తించలేకపోతున్నారు. నిజానికి కిడ్నీ సమస్య వస్తే వెంటనే దాన్ని పసిగట్టలేం. ఎందుకంటే దానికి సంబంధించి లక్షణాలేవీ బయటపడవు. డాక్టర్ దగ్గరకి వెళ్లేసరికి కిడ్నీలు డ్యామేజ్ అయి ఉంటాయి. అంటే లక్షణాలేవీ బయటపడకుండా లోలోపలే సమస్య ముదిరిపోతుంది. తద్వారా కొన్నిసార్లు ప్రాణాంతకం కావొచ్చు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తుంటారు.
ఎవరికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎవరు కిడ్నీ టెస్ట్‌లు చేయించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ మార్చి నెలంతా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే ప్రతి ఏటా మార్చి నెల రెండో గురువారాన్ని ‘వరల్డ్ కిడ్నీ డే’గా సెలబ్రేట్ చేస్తారు. ఈసారి మార్చి13న వరల్డ్ కిడ్నీ డే. ఏడాదికో థీమ్‌తో ఈ డేని సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ ఏడాది థీమ్ ఏంటంటే... ‘‘మీ కిడ్నీలు బాగానే ఉన్నాయా? వెంటనే పరీక్షించుకోండి. మీ కిడ్నీల ఆరోగ్యాన్ని రక్షించుకోండి” అంటూ అవేర్నెస్ కల్పిస్తున్నారు.
డా. సింధు ఖాజా
కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ & ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్
రెనోవా సెంచరీ హాస్పిటల్స్, హైదరాబాద్