మక్తల్, వెలుగు : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు జాతీయస్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడలకు ఎంపికయ్యారు. ఈనెల 21న సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో జరిగిన ఏఐఎస్(ప్రభుత్వ ఉద్యోగుల) రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభను కనబరిచి జాతీయ క్రీడలకు ఎంపికయ్యారు. కర్ని జడ్పీహెచ్ఎస్ లో పీఈటీగా పనిచేస్తున్న పట్టణానికి చెందిన రూప మహిళా విభాగం లాంగ్ జంప్‌లో ప్రథమ స్థానం సాధించింది.
మాగనూర్ లో టీచర్ గా పనిచేస్తున్న దీప 800 మీటర్లు, కొత్తకోటలో వెటర్నరీ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శిల్ప 200 మీటర్ల పరుగులో ప్రథమ స్థానంలో నిలిచారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చండీఘడ్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారు. వీరిని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహరి , బీజేపీ నాయకులు కొండయ్య, క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు నరసింహ గౌడ్, తాన్ సింగ్, సత్య ఆంజనేయులు, క్రీడాకారులు అభినందించారు.