రిజర్వాయర్​లో పడి ముగ్గురు విద్యార్థుల మృతి

దేవరకొండ, వెలుగు: నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం అక్కంపల్లి బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్(ఏకేబీఆర్)లో పడి ముగ్గురు యువకులు మృతిచెందారు. గుడిపల్లి ఎస్సై వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​ చిలుకూరులోని బీఫార్మసీ కాలేజీకి చెందిన స్టూడెంట్లు, వారి ఫ్రెండ్స్​8 మంది నాగార్జునసాగర్ కు రెండు కార్లలో వెళ్లారు. సాగర్ పరిసర ప్రాంతాలను సందర్శించిన అనంతరం తిరుగు ప్రయాణంలో పీఏపల్లి మండలంలోని ఏకేబీఆర్ ​దగ్గర ఆగారు. 

డిండి ఆకాశ్(20) ఈత కొట్టేందుకు రిజర్వాయర్​లోకి దిగాడు. నీటి ఉద్ధృతికి మునిగిపోతుండడంతో అతన్ని రక్షించే ప్రయత్నంలో ఫ్రెండ్స్​ బంటు గణేశ్(20), పండిట్ కృష్ణ(18)  కూడా గల్లంతయ్యారు. ఆందోళన చెందిన మిగిలిన స్టూడెంట్లు గట్టిగా అరవడంతో సమీపంలో ఉన్నవారు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.  ప్రమాదంలో మృతిచెందిన పండిట్ కృష్ణ స్వగ్రామం మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా. ఇతని తండ్రి గజానంద్ పీఏ పల్లి మండలం పుట్టంగండిలో ఉన్న ప్రైవేట్ స్కూల్​లో కొన్నేండ్లుగా హిందీ టీచర్​గా చేస్తున్నాడు. కూతురు ప్రియాంక బీ ఫార్మసీ చదువుతోంది.

ఆకాశ్, గణేశ్ ​ఆమె క్లాస్​మేట్స్. ఆకాష్ ది నిజామాబాద్ జిల్లా బీచ్ కొండ కాగా బంటు గణేశ్​ ది సిరిసిల్ల జిల్లా వేములవాడ. సమాచారం అందిన వెంటనే దేవరకొండ డీఎస్పీ నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీయించారు. డెడ్​బాడీలను పోస్టుమార్టం కోసం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.