Mystery Of Missing: ఒకేరోజు ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్

Mystery Of Missing: ఒకేరోజు ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్
  • వేర్వేరు చోట్ల ముగ్గురు మిస్సింగ్

పద్మారావునగర్, వెలుగు: ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు మిస్సింగ్​అయ్యాడు. చిలకలగూడ ఎస్ఐ వి.జ్ఞానేశ్వర్ వివరాల ప్రకారం.. దూద్ బావికి చెందిన పాస్తం నాగరాజు కొడుకు పోచయ్య అలియాస్​నవీన్(11) స్థానిక గవర్నమెంట్​స్కూల్లో ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు. గత నెల 31న ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. రాత్రైనా ఇంటికి తిరిగిరాకపోవడంతో బాధిత కుటుంబసభ్యులు తెలిసిన చోట్ల గాలించారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులను ఆశ్రయించాడు.

ఘట్​కేసర్​లో బాలిక

ఘట్​కేసర్: ఘట్​కేసర్ పీఎస్ పరిధిలో మరో బాలిక అదృశ్యమైంది. భువనగిరికి చెందిన కుంజ రాజు, స్రవంతి దంపతులు. వీరికి కుమార్తె గానశ్రీ(12), రెండేళ్ల కొడుకు ఉండగా, ఉపాధి కోసం ఘట్​కేసర్ కు వచ్చి, మాధవరెడ్డి వంతెన సమీపంలో అద్దెకు ఉంటున్నారు. రాజు నిత్యం మేస్త్రీ పనికి వెళ్తుండగా, స్రవంతి ఇళ్లల్లో పనిచేస్తుంది. ఇంటికి సమీపంలో అత్యవసరంగా పని ఉందని పిలుపు రావడంతో బుధవారం ఉదయం 11 గంటలకు స్రవంతి తన కొడుకును తీసుకొని వెళ్లింది. అనంతరం మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చేసరికి కుమార్తె గానశ్రీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పరుశురాం తెలిపారు.  

పోచారంలో ఇంజినీరింగ్ స్టూడెంట్

పోచారం ఐటీ కారిడార్ పరిధిలో ఇంజినీరింగ్ స్టూడెంట్ ఆచూకీ మిస్టరీగా మారింది. కరీంనగర్​కు చెందిన జీ.రామకృష్ణ కొడుకు అజితేశ్(20) పోచారం మున్సిపాలిటీ యంనంపేటలో అద్దెకుంటూ శ్రీనిధి కాలేజీలో బీటెక్ థర్డియర్ చదువుతున్నాడు. గత నెల 23న కరీంనగర్​కు వెళ్లి, 28న కాలేజీకి వచ్చాడు. ఆ మరుసటి రోజు కాలేజీలో జరిగిన ఫెస్ట్​కూ హజరయ్యాడు.

అదేరోజు సాయంత్రం వారాసిగూడలో ఉండే తన ఫ్రెండ్ వద్దకు వెళ్తున్నానని, రూంమేట్​కు ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత రాత్రి ఏడున్నర గంటల నుంచి అజితేశ్ ఫోన్ కలవట్లేదు. దీంతో బాధిత తల్లిదండ్రులు తెలిసిన వారిని, బంధువులు, స్నేహితులను విచారించిన ఫలితం లేకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజువర్మ తెలిపారు.