- గురువారం ఒకరిని
- కరిచిన పాము
- శుక్రవారం కండ్లు తిరిగి
- పడిపోయిన మరో ఇద్దరు
- వరంగల్, హనుమకొండ దవాఖానలకు తరలింపు
- ఒకరి పరిస్థితి విషమం
ములుగు, వెలుగు : ములుగు మండలం బండారుపల్లి గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు పాము కాట్లతో దవాఖానలో చేరారని సమాచారం. గురువారం రాత్రి ఒక విద్యార్థిని పాము కరవడంతో వరంగల్ కు తరలించగా, శుక్రవారం ఉదయం మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని హనుమకొండలోని ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు.
బండారుపల్లిలోని టీఎస్ఆర్ఎస్ గురుకుల స్కూల్లో 8వతరగతి చదువుతున్న పందికుంటకు చెందిన శ్రీకర్ గురువారం రాత్రి వర్షం కురుస్తుండగా బట్టలు తీసేందుకు బయటకు వచ్చాడు. అక్కడే ఉన్న పాము కాలిపై కాటెయ్యడంతో వెంటనే పరిగెత్తుకు వెళ్లి టీచర్లకు చెప్పాడు. వారు ములుగు ఏరియా దవాఖానకు, అక్కడి నుంచి వరంగల్ హాస్పిటల్‌కు తరలించారు.
శుక్రవారం ఉదయం ప్రేయర్ టైంలో భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లికి చెందిన కార్తీక్, వెంకటాపూర్ మండలం కేశవాపూర్‌కు చెందిన ప్రణయ్ కండ్లు తిరిగి పడిపోయారు. దీంతో టీచర్లు వీరిని కూడా ములుగు దవాఖానకు తరలించారు. నురుగులు కక్కుతూ అపస్మారక స్థితికి చేరుకోవడంతో అక్కడి డాక్టర్లు వరంగల్ ఎంజీఎంకు వెళ్లాలని సూచించారు.
విద్యార్థుల తల్లిదండ్రులు వారిని హన్మకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఘటనపై ప్రిన్సిపాల్ వివరణ కోరేందుకు ఫోన్ చేయగా ఎత్తలేదు. టీచర్లు మాత్రం ఫుడ్‌పాయిజన్‌తో స్టూడెంట్స్‌కు కడుపునొప్పి రావడంతో దవాఖానకు తీసుకెళ్లామని చెబుతున్నారు. ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు.
అందరికీ యాంటీ వీనం ఇచ్చాం : డాక్టర్లు
శుక్రవారం అస్వస్థతకు గురైన ఇద్దరి నోటి నుంచి నురుగు రావడంతో స్థానిక డాక్టర్లు పాము Aకూడా ఒకే విధమైన లక్షణాలు కనిపించడంతో యాంటీ వీనం ఇచ్చామని ములుగు డాక్టర్లు చెప్పారు. ల్యాబ్ రిపోర్టులు వస్తేనే ఏం జరిగిందనే తెలుస్తుందని వరంగల్‌లోని డాక్టర్లు చెప్పారు. ముగ్గురిలో కార్తీక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.