సంగారెడ్డి, వెలుగు : పనులు వదిలి బడిబాట పట్టాలని ప్రచారం చేయాల్సిన టీచర్లే స్టూడెంట్లతో చాకిరీ చేయించారు. విద్యార్థినులు పనులు చేస్తున్న ఫొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి కేపీహెచ్‌బీ -2 కాలనీలోని ప్రైమరీ స్కూల్‌లో జరిగిన ఈ ఘటన శనివారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే... రిపబ్లిక్ డేను పురస్కరించుకొని పోతిరెడ్డిపల్లి కేపీహెచ్‌బీ 2 కాలనీలోని ప్రైమరీ స్కూల్‌కు చెందిన టీచర్లు శుక్రవారం కొందరు స్టూడెంట్లతో గ్రౌండ్ క్లీన్ చేయించారు. ఈ ఫొటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విషయం తెలుసుకున్న కలెక్టర్ క్రాంతి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీఈవో వెంకటేశ్వర్లును ఆదేశించారు. దీంతో కార్మిక శాఖ ఆఫీసర్లు శనివారం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఈ మేరకు పాఠశాలలో పనిచేస్తున్న ఎస్‌జీటీలు శారద, మంజుల, నాగమణిని సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.