
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కిష్త్వార్‌లోని చత్రు ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. చత్రు ప్రాంతంలో టెర్రరిస్టులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఏప్రిల్ 10న భద్రతా దళాలు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ఏప్రిల్ 10న ఓ టెర్రరిస్టు, ఏప్రిల్ 11న ఇద్దరు టెర్రరిస్టులను జవాన్లు మట్టుబెట్టారు.
జమ్మూ, కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగిందని అధికారులు వెల్లడించారు. ఘటన స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఘటన స్థలంలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నామని అధికారులు తెలిపారు. మరికొందరు ఉగ్రవాదులు ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో కిష్త్వార్ ప్రాంతంలో జరిగిన అతిపెద్ద ఆపరేషన్లలో ఇది ఒకటని తెలిపారు.