200 రోజుల్లో డబ్బులు డబుల్​ అంటూ .. మూడు వేల మందిని ముంచిండు

200 రోజుల్లో డబ్బులు డబుల్​ అంటూ .. మూడు వేల మందిని ముంచిండు
  • ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మనీ సర్క్యులేషన్ ​స్కీం పేరుతో మోసం
  • పోలీసులను ఆశ్రయించిన బాధితులు

నేలకొండపల్లి, వెలుగు: ‘ రెండు వందల రోజుల్లో పెట్టుబడి డబుల్​అవుతుంది. ప్రతిరోజూ మీ పెట్టుబడుల్లో వన్​పర్సెంట్​తిరిగిస్తాం’ అంటూ ఓ కంపెనీ పలువురిని కోట్ల రూపాయలకు ముంచింది. దీంతో బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంగాపురం తండాకు చెందిన భూక్య వీరన్న గత ఏడాది ఎస్​ఎస్​వీ ఎంటర్ ప్రైజెస్ , ఎస్​ఎస్​వీకే ట్రేడింగ్ ఆన్​లైన్​ మనీ సర్క్యులేషన్ పేరుతో సంస్థలను ప్రారంభించాడు. దీని కోసం ప్రత్యేకంగా ఓ యాప్​ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చాడు. ఏజెంట్లను నియమించుకుని ఎవరైనా పెట్టుబడి పెడితే 200 రోజుల్లోనే డబుల్​ అవుతుందని, రోజూ వన్ ​పర్సంట్ ​రిటర్న్ ​వస్తుందని నమ్మించాడు. 

ఐదు వేలకు తక్కువ కాకుండా పెట్టుబడి పెట్టాలని ప్రచారం చేశాడు. మొదట పెట్టుబడి పెట్టిన వారికి ప్రతి రోజూ డబ్బులు ఇస్తుండడంతో అత్యాశ పడ్డ సుమారు మూడు వేల మంది సభ్యులుగా చేరారు. ఈ మధ్య డబ్బులు రాకపోవడంతో పెట్టుబడి పెట్టిన వారు అడగడం మొదలుపెట్టారు. టెక్నికల్​ఇష్యూ ఉందని, కొద్దిగా ఆలస్యమవుతుందని చెప్పారు. సమయం గడుస్తున్నా ఇవ్వకపోవడంతో బాధితులు వెంటపడ్డారు. దీంతో సంస్థ చైర్మన్ వీరయ్య వారం కింద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.  దీంతో తాము కట్టిన డబ్బులు ఇవ్వడం లేదని చెన్నారం గ్రామానికి చెందిన మానుకొండ రామారావు స్థానిక పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టడంతో మిగిలిన వారు కూడా పీఎస్​కు  క్యూ కట్టారు.  దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.