స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రత

మంచిర్యాల/ఆదిలాబాద్/నస్పూర్, వెలుగు: స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు రామగుండం పోలీస్​ కమిషనర్​ఎం.శ్రీనివాస్ తెలిపారు. హాజీపూర్​ మండలం ముల్కల్లలోని ఐజా ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్​లను మంగళవారం సీపీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇప్పటికే 144 సెక్షన్‌ అమల్లో ఉందన్నారు. 

లోకల్​ పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వ్, సెంట్రల్​ఫోర్స్​తో పహారా కాస్తున్నారని తెలిపారు. ఫైర్​ యాక్సిడెంట్లకు అవకాశం లేకుండా అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచామన్నారు. సీసీ టీవీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని, ఏసీపీ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట డీసీపీ అశోక్​కుమార్, ఏసీపీ ప్రకాశ్, రూరల్ సీఐ ఆకుల అశోక్, విమెన్​ పీఎస్​ఎస్​ఐ వెంకట నర్సయ్య ఉన్నారు. 

ఓటింగ్​ యంత్రాలు భద్రం

ఓటింగ్​యంత్రాలను భద్రపరిచినట్లు మంచిర్యాల ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ముల్కలలోని ఐజా ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ఖర్చుల పరిశీలకులు సమీర్ సమక్షంలో భద్రపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. రాజకీయ పార్టీలు సహకరించడం సంతోషంగా ఉందన్నారు. మంచిర్యాల ఆర్డీఓ, సహాయ రిటర్నింగ్ అధికారి వి.రాములు, ప్రత్యేక ఉపపాలనాధికారి డి.చంద్రకళ, ఎన్నికల విభాగం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కట్టుదిట్టమైన భద్రత

ఈవీఏంలను భద్ర పరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల పరిశీలకులు రాజేంద్ర విజయ్, ఆదిలాబాద్​ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూంలను మంగళవారం పరిశీలించారు. ఆయా సెగ్మెంట్ల నుంచి తరలించిన ఈవీఎంలను సరిచూసుకుని, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వాటిని స్ట్రాంగ్ రూమ్ లలో అమర్చినట్లు తెలిపారు. వారి వెంట ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అడిషనల్ కలెక్టర్లు శ్యామలాదేవి, దీపక్ తివారీ ఉన్నారు.