
- శ్రీకాళహస్తి ఆలయంలో ఘటన
- మండిపడ్డ హిందూ సంఘాల నేతలు
- ప్రధాన అర్చకుడు, అధికారులపై సస్పెన్షన్
తిరుపతి : పెళ్లి కావట్లేదని ముగ్గురు అన్నదమ్ములు చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శ్రీకాళహస్తి ఆలయంలో అక్రమంగా శివలింగం, నంది విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ నెల 11న అక్రమంగా ప్రతిష్టించిన ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీంతో రాష్ట్రంలోని హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన తరుణంలో ప్రధాన అర్చకుడితో పాటు ఆలయ అధికారులపై ఈవో సస్పెన్షన్ వేటు వేశారు.
అయితే ఆ విగ్రహాలను ప్రతిష్టించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుత్తూరుకి చెందిన సులవర్ధన్, తిరుమలయ్య, ముని శేఖర్ అనే ముగ్గురు సోదరులు.. తమకు వివాహం కాకపోవటంతో ఆలయంలో శివ లింగం, నంది విగ్రహాలను ప్రతిష్టించినట్లు పోలీసుల విచారణలో తెలిపారు. దోషం పోవాలంటే పూజలు చేయాలని ఓ స్వామీజీ ఇచ్చిన సలహాతోనే ఇలా చేసినట్లు తెలిపారు. తిరుపతిలో ఈనెల 2న విగ్రహాలు చేయించి, ఈనెల 6న ఆలయంలో పెట్టినట్లు విచారణలో పోలీసులు తేల్చారు.
సీసీ టీవీ విజువల్స్, ద్విచక్రవాహనాల నెంబర్లు ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుండి రెండు ద్విచక్రవాహనాలు, మూడు సెల్ ఫోన్‌లు సీజ్ చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.