- రూ.20వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు
హైదరాబాద్, వెలుగు: ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురిని హత్య చేసిన ముగ్గురు నిందితులకు హైకోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. వరకట్న కేసు పెట్టి ఇబ్బందులకు గురిచేసిందన్న కారణంగా భార్య, అత్తమామలు, బావమరుదులను మర్డర్ చేసిన కేసులో నిందితులు సయ్యద్ జహంగీర్, సోదరుడు సయ్యద్ కరీం, బావమరిది జబ్బార్ హుస్సేన్‌కు యావజ్జీవ శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. నిందితులు మూడు నెలల్లో కింది కోర్టులో లొంగిపోవాలని షరతు విధించింది.
హైదరాబాద్ అంబర్‌పేటలో ఉంటున్న దంపతులు మహమ్మద్ ఖమరుద్దీన్, సాజిదా బేగం, వారి కుమారులు అబ్దుల్లా బియాబిని, మహమ్మద్ కిర్మాణి, కుమార్తె నేహా అఫ్రిన్ హత్య కేసులో నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. మొత్తం 9 మంది నిందితుల్లో ముగ్గురికి యావజ్జీవ శిక్ష విధించింది. నిందితుడు సయ్యద్ జహంగీర్, నేహా అఫ్రిన్‌కు 2008లో పెండ్లి జరిగింది. 3 నెలలు కాపురం చేశాక విభేదాలతో నేహా అఫ్రిన్ తన తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది.
భర్త, అతని తల్లిదండ్రులపై వరకట్న నిషేధ చట్టం కింద కేసు పెట్టింది. దీంతో అఫ్రిన్ ఫ్యామిలీపై కక్ష పెంచుకున్న జహంగీర్.. అతని కుటుంబసభ్యులతో కలిసి 2010, మే 30న దాడి చేసి భార్య నేహా అఫ్రిన్, ఆమె తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులను హత్య చేశాడు. మృతుల కోడలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జహంగీర్‌తో పాటు అతని 8మంది కుటుంబసభ్యులపై పోలీసులు కేసు పెట్టారు. దీనిపై విచారించిన కింది కోర్టు.. పోలీసు దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందంటూ అందరినీ నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు వెలువరించింది.
దీనిపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు జడ్జిలు జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ జువ్వాడి శ్రీదేవితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దర్యాప్తులో లోపం ఉందన్న కారణంగా ఐదుగురిని హత్య చేసిన వారిని నిర్దోషులుగా పేర్కొనలేమంది. ఇది సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమని చెప్పింది. మృతుడి భార్య నిందితులను గుర్తించలేదని, ఆమె సాక్ష్యం చెల్లదన్న నిందితుడి వాదనను తోసిపుచ్చింది. ఐదుగురిని హత్య చేసిన వారిపై కోర్టు ఉదాసీనంగా వ్యవహరించలేదని పేర్కొన్నది. ప్రధాన నిందితుడు జహంగీర్, అతని సోదరుడు, బావమరుదులకు యావజ్జీవ శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది.