- సూర్యాపేట కలెక్టరేట్‌లో ముగ్గురు మహిళల ఆత్మహత్యాయత్నం
సూర్యాపేట, వెలుగు : తమ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని ఎన్ని సార్లు ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ముగ్గురు మహిళలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన సూర్యాపేట కలెక్టరేట్‌లో సోమవారం జరిగింది. నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన మేడం ముత్తయ్యకు ఏడుగురు సంతానం. ఇతనికి ఇదే గ్రామంలో 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ముత్తయ్య తన ముగ్గురు కొడుకులకు 1.20 ఎకరాల చొప్పున పట్టా చేయించి మిగతా భూమిని తన పేరున ఉంచుకున్నాడు.
వీరంతా చెన్నై ప్రాంతానికి వలస వెళ్లి అక్కడ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన భూతరాజు రామారావు, భూతరాజు బాజీ అనే వ్యక్తులు సర్వే నంబర్ 190లో ముత్తయ్యకు చెందిన రెండున్నర ఎకరాల భూమిని కబ్జా చేసి 2016లో పట్టా చేయించుకున్నారని బాధితులు ఆరోపించారు. ఈ విషయమై మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.
దీంతో సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ముత్తయ్య చిన్న కోడలు లక్ష్మమ్మ, మూడో కుమారుడు రాములు కుమార్తె పుల్లమ్మ, కోడలు అరుణ కలెక్టరేట్ మీటింగ్ సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. గమనించిన పోలీసులు వెంటనే పెట్రోల్ బాటిల్ గుంజుకొని బాధితులను కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని కలెక్టర్ తేజల్ నందులాల్ హామీ ఇచ్చారు.