KPHB అడ్డగుట్టలో దారుణం : నిర్మాణంలోని అపార్ట్ మెంట్ గోడ కూలి ముగ్గురు మృతి

కూకట్ పల్లి KPHB అడ్డగుట్టలో దారుణం జరిగింది. నిర్మాణంలోని పెద్ద అపార్ట్ మెంట్.. గోడ కూలి ముగ్గురు చనిపోయారు. 2023, సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం ఈ ఘటన జరిగింది. కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ సమీపంలోనే.. ప్రగతినగర్ నుంచి జేఎన్ టీయూకు వచ్చే రహదారిలో మధ్యలో ఉంటుంది అడ్డగుట్ట. ఈ ప్రాంతంలోనే మెయిన్ రోడ్డుకు పక్కనే ఆరు అంతస్తుల్లో అతి పెద్ద అపార్ట్ మెంట్ నిర్మాణం జరుగుతుంది. 

గురువారం ఉదయం ఆరో అంతస్తులో కూలీలు పని చేస్తున్నారు. ఈ క్రమంలో సెంట్రింగ్ కర్రలు విరిగిపడ్డాయి. ఆ కర్రలతోపాటు నిర్మాణంలోని గోడ సైతం కూలిపోవటంతో.. అక్కడ పని చేస్తున్న కార్మికులు ముగ్గరు ఆరో అంతస్తు నుంచి ప్రధానమైన రోడ్డుపై పడ్డారు. ఆరో అంతస్తు నుంచి పడటంతోపాటు.. వారిపై కర్రలు, ఇటుకలు పడటంతో అక్కడికక్కడే చనిపోయారు. 

రహదారిపై కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఘటనా స్థలంలో కార్మికుల మృతదేహాలు, బ్రిక్స్, కర్రలతో భీతావహంగా ఉంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే రహదారి కావటం.. ఆఫీసుల సమయం కావటంతో.. ట్రాఫిక్ స్తంభించింది. 

అడ్డగుట్టలోనే ఇంత పెద్ద అపార్ట్ మెంట్.. అంటే ఆరు అంతస్తులకు అనుమతులు ఉన్నాయా లేదా అనేది స్పష్టం కావాల్సి ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా.. ఆరో అంతస్తులలో పని చేస్తుండటం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్థారించారు పోలీసులు. ఆరో అంతస్తు నుంచి కింద పడిన ముగ్గురు కార్మికుల మృతదేహాలతో ఆ రోడ్డు అంతా భయానకంగా మారింది.