
మూడేండ్ల బాలుడి కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి
నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ పట్టణంలో కిడ్నాప్ కలకలం చెలరేగింది. ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో ఆడుకుంటున్న మూడేండ్ల బాలుడిని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఈ నెల 4న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... నల్గొండకు చెందిన అహ్మద్, షమీ మున్నీసాబేగం దంపతులకు ఇద్దరు సంతానం. వీరు ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో ఉంటూ చిన్న చిన్న కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు.
వీరి పెద్ద కుమారుడు అబ్దుల్ రహమాన్ ఈ నెల 4న హాస్పిటల్ ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ వద్ద ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన తల్లిదండ్రులు రహమాన్ కోసం రెండు రోజులుగా వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో బాలుడి తల్లి షమీ మున్నీసా బేగం గురువారం నల్గొండ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు హాస్పిటల్ ఆవరణ, బస్టాండ్ సెంటర్‌లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి 4వ తేదీ మధ్యాహ్నం ఫోన్ మాట్లాడుకుంటూ హాస్పిటల్ ఆవరణలోకి వచ్చి, బాలుడిని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు నాలుగు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు.