
వేటగాళ్ల ఉచ్చులకు మూగజీవాలు బలవుతున్నాయి. మంగళవారం ఓ మచ్చల జింక మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదర్ పల్లి సమీపంలో జరిగింది. గున్గల్ రిజర్వ్ ఫారెస్టుకు సమీపంలో ఉన్న మామిడితోట దగ్గర అడవిపందులకు భిగించిన ఉచ్చుల్లో సుమారు మూడేళ్ల వయస్సుగల మచ్చల జింక పడి మృతి చెందింది. ఇది గమనించిన వేటగాళ్లు ఆ జింకను అటవీప్రాంతంలోకి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భయపడిన వేటగాళ్లు మచ్చల జింకను గుంత తీసి పాతిపెట్టి పరారయ్యారు. దీంతో పోలీసులు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి ఫారెస్టులో గాలించి మచ్చల జింకను పాతిపెట్టిన చోటును గుర్తించారు. మచ్చల జింకను వెలికితీసి పోస్టుమర్టం నిర్వహించారు. వేటగాళ్లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు అటవిశాఖ రేంజ్ అధికారి విష్ణువర్ధన్ . నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.