- అంగన్ వాడీ సిబ్బంది నిర్లక్ష్యంతో చిన్నారికి అస్వస్థత
- న్యాయం చేయాలని
- బాధిత కుటుంబం ధర్నా
తల్లాడ, వెలుగు: అంగన్ వాడీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చిన్నారి అస్వస్థతకు గురైన ఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా తెలిసింది. న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సోమవారం రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. ఏన్కూరు మండలం శ్రీరామగిరి అంగన్ వాడీ సెంటర్ లో ఈనెల 19న ప్రియా అనే మూడేండ్ల చిన్నారి అన్నం తిన్న తర్వాత మంచినీళ్లు అనుకొని పక్కనే ఉన్న డబ్బాలోని టర్పెంటైన్ ఆయిల్ తాగి అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు చిన్నారికి ఖమ్మం హాస్పిటల్ లో టీట్ మెంట్ చేయించి ఇంటికి తీసుకెళ్లారు.
రెండు రోజుల నుంచి మళ్లీ చిన్నారికి వాంతులు అవుతున్నాయి. దీంతో న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సోమవారం లచ్చగూడెం ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఇద్దరు అంగన్ వాడీ టీచర్ల నిర్లక్ష్యంతోనే పాప అస్వస్థతకు గురైందని ఆరోపించారు. తక్షణమే సిబ్బందిపై చర్యలు తీసుకొని, చిన్నారి ప్రియాకు మెరుగైన వైద్యం అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.