భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయి గూడెంలో విషాదం చోటుచేసుకుంది. కార్ డోర్స్ ఆటోలాక్ అయిన ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే సాంబాయి గూడెం గ్రామానికి చెందిన సాయికుమార్ , లిఖిత దంపతుల కుమార్తె కల్మిషా ఆటలాడుతూ కారులోకి ఎక్కింది. దీనితో ఆటోమేటిక్ గా కారు డోర్స్ లాక్ అయిపోయాయి. తల్లిదండ్రులు పాప ఎక్కడో ఆడుకుంటుంది అనుకుని నిర్లక్ష్యంగా వదిలేశారు.
ఎంతసేపటికి పాప కనిపించకపోవడంతో కారులో చూడగా.. కారులో స్పృహ తప్పి పడిపోయి చిన్నారి కనిపించింది. దీంతో వెంటనే పాపను హడావుడిగా మణుగూరులోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారణ చేశారు. చిన్నారి మృతితో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన అల్లారుడి మూడేళ్ల కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చిన్నారి నివాసానికి చేరుకుని ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు. స్థానికంగా ఈ ఘటన చాలామందిని కలిచి వేసింది.