యూకేలో భారత సంతతి సైంటిస్టులకు అవార్డులు

లండన్: యూకేలో భారత సంతతికి చెందిన ముగ్గురు సైంటిస్టులు ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికయ్యారు. మెడిసిన్, టెక్నాలజీలో పరిశోధనలు, కెమికల్​, ఫిజికల్ ​సైన్సెస్, ఇంజనీరింగ్, లైఫ్​ సైన్సెస్ రంగాల్లో అద్భుత ఆవిష్కరణలు చేసిన యువ సైంటిస్టులకు యూకేలో ‘బ్లావత్నిక్’ అవార్డులు ప్రదానం చేస్తారు.​ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ యువ సైంటిస్ట్​ అవార్డులకు 9 మంది ఎంపికవగా, వారిలో భారత సంతతికి చెందిన ముగ్గురు పరిశోధకులు ఉండటం విశేషం. ప్రొఫెసర్లు రాహుల్ ఆర్ నాయర్, మెహుల్ మాలిక్, తన్మయ్ భరత్​ సహా మిగతా సైంటిస్టులు ఫిబ్రవరి 27న లండన్‌‌‌‌లో జరిగే బ్లాక్-టై గాలా డిన్నర్ వేడుకలో అవార్డులు అందుకోనున్నారు.

వారికి ప్రత్యేక సన్మానంతోపాటు మొత్తం 4,80,000 పౌండ్ల గ్రాంట్‌‌‌‌అందనుంది. మాంచెస్టర్ యూనివర్సిటీలో మెటీరియల్ ఫిజిసిస్ట్ అయిన నాయర్ ఫిజికల్ సైన్సెస్, ఇంజనీరింగ్‌‌‌‌లో విభాగంలో అద్భుత పరిశోధనల ఫలితంగా అవార్డుకు ఎంపికయ్యారు. మరో సైంటిస్టు మాలిక్ క్వాంటం ఫిజిక్స్​లో చేసిన కృషికి అవార్డు వరించింది. ఎమ్మార్సీ లాబొరేటరీ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ నుంచి పీహెచ్​డీ తీసుకున్న తన్మయ్.. ఎలక్ట్రాన్ క్రియోటోమోగ్రఫీలో టెక్నాలజీని డెవలప్​చేసి అవార్డుకు ఎంపికయ్యారు.