ఒక్కరోజే ముప్పైలలోనే ఆగిన మూడు గుండెలు 

  •     ఎక్సర్ ​సైజ్​ చేసి ఒకరు..తింటూ మరొకరు..
  •     చెల్లి కోసం ఆలోచిస్తూ ఇంకొకరు..        

 ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా కేంద్రంలో ఒకే రోజు ఇద్దరు యువకులు గుండెపోట్లతో చనిపోయారు. వీడీవోఎస్​ కాలనీలో ఉంటున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ లీడర్ మానుకొండ రాధ కిషోర్ రెండో కొడుకు శ్రీధర్(25) సోమవారం ఉదయం ఇంట్లో ఎక్సర్​సైజ్​ చేశాడు. కొద్దిసేపటికే ఛాతిలో నొప్పి వస్తుందంటూ పని మనుషులకు చెప్పి రెస్ట్ ​తీసుకుంటానని రూమ్​లోకి వెళ్తుండగా కుప్పకూలాడు. కాసేపటికే చనిపోయాడు. శ్రీధర్ ​డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయ బాధ్యతలు చూసుకుంటున్నాడు.

అల్లీపురానికి చెందిన గరికపాటి నాగరాజు(33) ఆదివారం సాయంత్రం భోజనం చేస్తుండగా కిందపడిపోయాడు. కుటుంబసభ్యులు 108కి సమాచారం ఇచ్చి ఆటోలో హాస్పిటల్​కు తీసుకువెళ్తుండగా మధ్యలో 108 ఎదురైంది. వారు చెక్ ​చేసి హార్ట్​ ఎటాక్​ తో నాగరాజు చనిపోయాడని చెప్పారు. నాగరాజు పెయింటింగ్ వర్క్ చేస్తాడు. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు.

చెల్లెలు జాడ తెలియక.. 

నవీపేట్ : భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన చెల్లెలి ఆచూకీ కోసం వెతుకుతూ ఓ అన్న గుండెపోటుతో కన్నుమూశాడు. నిజామాబాద్​ జిల్లా నవీపేట్ మండలంలోని హనుమాన్ ఫారానికి చెందిన డి. నరేశ్​(36), అనిత అన్నాచెల్లెళ్లు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో అన్నీ తానై పెంచాడు. తొమ్మిదేండ్ల కింద నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన రాజుకు ఇచ్చి పెండ్లి చేశాడు. ఈ నెల 7న అనిత భర్తతో గొడవపడి, కొడుకు జశ్వంత్​ను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది.

అప్పటి నుంచి అన్న నరేశ్, కుటుంబసభ్యులతో కలిసి చెల్లి ఆచూకీ కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఆమె ఎక్కడుందోనని మదనపడుతుండగా నరేశ్​కు హార్ట్​ఎటాక్​ వచ్చింది. జిల్లా కేంద్రంలో ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించగా, ట్రీట్​మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. నరేశ్​కు భార్య నవ్య, కొడుకు, కూతురు ఉన్నారు.