పెట్రోల్ పోసుకున్నారు..క్యాష్ ఇవ్వమన్నందుకు చంపేశారు

రంగారెడ్డి జిల్లా : నార్సింగిలో దారుణం జరిగింది. పెట్రోల్ పంపులో పని చేసే కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో సంజయ్ అనే కార్మికుడు మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. 

అసలేం జరిగింది..? 

అర్థరాత్రి సుమారు 12 గంటల సమయంలో జన్వాడలోని HP బంకు వద్దకు పెట్రోల్ కోసం ముగ్గురు యవకులు కారులో వచ్చారు. ప్రస్తుతం బంక్ క్లోజ్ చేశామని, ఈ సమయంలో పెట్రోల్ లేదని బంకు సిబ్బంది చెప్పారు. అయితే.. తాము చాలా దూరం వెళ్లాలని, ఎలాగైనా పెట్రోల్ పోయాలని ఆ యువకులు వేడుకున్నారు. దీంతో కారులో పెట్రోల్ పోశారు సిబ్బంది. అయితే.. కార్డు పని చేయకపోవడంతో క్యాష్ ఇవ్వమని బంకులో పని చేసే సిబ్బంది సూచించారు. దీంతో రెచ్చిపోయిన ముగ్గురు యువకులు.. పెట్రోల్ బంకు సిబ్బందిపై దుర్భాషలాడుతూ వారిపై దాడి చేశారు. క్యాషియర్ ను కొడుతుండగా.. కొట్టవద్దని సంజయ్ అనే కార్మికుడు అడ్డుగా వెళ్లాడు. దీంతో అతడిపైనా దాడి చేయడంతో స్పాట్ లోనే సంజయ్ కుప్పకూలాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. పరిస్థితి విషమించి.. అప్పటికే సంజయ్ చనిపోయాడు. పెట్రోల్ బంకు సిబ్బందిపై దాడి చేసిన తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బంకులో ఏర్పాటు చేసి ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. 

సంజయ్ మృతితో అతడి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారిని ఓదార్చం ఇప్పుడు ఎవరి తరమూ కావడం లేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు.. ముగ్గురు యువకులపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పెట్రోల్ బంకు క్లోజ్ అయినప్పటికీ.. దూరం వెళ్లాలని చెబితే కనికరించి పెట్రోల్ పోసిన పాపానికి నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నారు ముగ్గురు యువకులు. నిందితులు జన్వాడ గ్రామానికి చెందిన నరేందర్, మల్లేష్, అనూప్ గా గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

మద్యం మత్తులో దాడి

పెట్రోల్ అర్ధరాత్రి సమయంలో పోయమని చెప్పినా.. వినిపించుకోలేదని బంకు సిబ్బంది చెబుతున్నారు. పెట్రోల్ పోసిన తర్వాత నగదు విషయంలో వివాదం తలెత్తిందని, ఈ క్రమంలోనే సంజయ్ పై దాడి చేయడంతో అతను కిందపడిపోయాడని చెప్పారు. మద్యం మత్తులోనే నిందితులు దాడి చేశారని చెబుతున్నారు. 

కఠినంగా శిక్షించాలని డిమాండ్ 

సంజయ్ మృతికి‌ కారణమైన ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. జన్వాడ గేట్ వద్ద కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధర్నాకు దిగారు. రాస్తారోకో చేపట్టడంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. ముగ్గురు నిందితులపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో పలు కేసులు ఉన్నాయని, వారు ముగ్గురు దొంగతాలల్లో ప్రధాన నిందితులుగా సమాచారం అందుతోంది. గత నెలలో ఓ విలేకరిపైనా విచక్షణారహితంగా దాడి చేశారని చెబుతున్నారు.