స్నాప్​చాట్​లో పరిచయమైన యువతిని బెదిరించి రూ.48 లక్షలు వసూలు సిటీకి చెందిన ముగ్గురు యువకులు అరెస్ట్

స్నాప్​చాట్​లో పరిచయమైన యువతిని బెదిరించి రూ.48 లక్షలు వసూలు సిటీకి చెందిన ముగ్గురు యువకులు అరెస్ట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: స్నాప్‌చాట్‌లో యువతిని పరిచయం చేసుకొని.. ఆమె నుంచి రూ.48 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన  ఓ యువతికి తొలత అమన్ జోషి అనే వ్యక్తి స్నాప్‌చాట్‌లో పరిచయమయ్యాడు. 

స్నేహంగా ఉంటూ ఆమె నుంచి రూ.15 వేలు అప్పుగా తీసుకున్నాడు. డబ్బులు తిరిగివ్వమని యువతి అడగగా పట్టించుకోలేదు. ఆ తర్వాత అమన్ జోషి.. తన ఫ్రెండ్స్ ఇద్దరిని పోలీసుల గెటప్ లో యువతి వద్దకు పంపాడు. అమన్ జోషి వద్ద అక్రమంగా బంగారం కొన్నందుకు అరెస్ట్ చేస్తున్నామని బెదిరించారు. ఈ కేసులో బెయిల్ కావాంటే రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

కేసులో ఇరుక్కుంటే తన జాబ్ పోతుందనే భయంతో వారు అడిగినంత డబ్బును బదిలీ చేసింది. ఇలా యువతి నుంచి విడతల వారీగా మొత్తం రూ.48.38 లక్షలు వసూలు చేశారు. డబ్బు ఇస్తున్నా వేధింపులు ఆగకపోవడంతో మానసికంగా కుంగిపోయిన బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. చివరకు ధైర్యం తెచ్చుకొని గతేడాది అక్టోబరులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, శనివారం హైదరాబాద్​కు చెందిన అమన్ జోషి(రాంకోటి), ప్రశాంత్(షాహినాయత్‌గంజ్), రోహిత్ శర్మ(పాండురంగ నగర్)ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి మూడు మొబైల్ ఫోన్లు, 5 బ్యాంక్ చెక్ బుక్కులు, డెబిట్, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.