
వరంగల్/కేయూ క్యాంపస్, వెలుగు: వరంగల్కాకతీయ యూనివర్సిటీ పీహెచ్‍డీ అడ్మిషన్లపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ శనివారం క్యాంపస్‌లో పర్యటించింది. కమిటీ సభ్యులైన ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఓయూ అడ్మిషన్స్ డైరెక్టర్ పాండురంగారెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్, జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు దాదాపు 40 నిమిషాలు కేయూ వీసీ తాడికొండ రమేశ్‌తో సమావేశమయ్యారు. అనంతరం డిపార్ట్ మెంట్ల వారీగా డీన్లతో మాట్లాడారు.
ప్రధానంగా అడ్మిషన్ల టైంలో యూజీసీ గైడ్‍లైన్స్ ఎలా ఉన్నాయి? వాటిని ఎంతవరకు ఫాలో అయ్యారు? అని ప్రశ్నించినట్లు తెలిసింది. తర్వాత స్టూడెంట్లు, స్టూడెంట్ యూనియన్ల నుంచి త్రిసభ్య కమిటీ సభ్యులు వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధిత స్టూడెంట్లు మాట్లాడుతూ.. అడ్మిషన్లలో తమకు అన్యాయం జరిగిందని, వర్సిటీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. విచారణ పూర్తయ్యాక కమిటీ సభ్యులు ప్రభుత్వానికి రిపోర్టు అందజేయనున్నారు.