కేసీఆర్ ప్రయోగాలు ఫెయిల్.. మొండిగా నిర్ణయాలు.. తర్వాత యూటర్న్స్

గడిచిన కాలంలో ఫెయిల్యూర్స్ ను రివ్యూ చేసుకుని సరిదిద్దుకుని ముందుకు సాగితేనే మనిషికైనా, వ్యవస్థకైనా మనుగడ సాధ్యం. 2020 సంవత్సరం అంతా తెలంగాణలో టీఆర్ఎస్ పాలన అస్తవ్యస్తంగా సాగింది. సచివాలయ కూల్చివేతతో పాలనను సీఎం కేసీఆర్ పాతిపెట్టారు. సంస్కరణలు తెస్తున్నానంటూ గొప్పగా చెప్పుకొని చేసిన కొత్త చట్టాల ప్రయోగం ఫెయిల్ అయింది. అనాలోచితంగా తీసుకున్న పలు నిర్ణయాలు వివాదస్పదం కావడమే కాదు, ప్రజలకు లేనిపోని కష్టాలు తెచ్చిపెట్టాయి. చివరకు వాటిపై యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. 2020లో ప్రజల్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టిన కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరింత కష్టాలపాలు చేశాయి. మొత్తంగా ఏడాది అంతా సీఎం కేసీఆర్ పాలన ప్రజలకు అసంతృప్తినే మిగిల్చింది. అందుకే దుబ్బాక బై ఎలక్షన్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేక ఫలితాలొచ్చాయి. కరోనాపై సర్కార్ నిర్లక్ష్యం వందేండ్ల తర్వాత ప్రపంచ మానవాళికి ఎదురైన అతి పెద్ద కష్టం కరోనా. ఈ వైరస్ కట్టడిలో తెలంగాణ సర్కారు చేయాల్సినంత చేయలేదన్న ఆరోపణలున్నాయి. కరోనా వేగంగా స్ప్రెడ్ అవుతున్న సమయంలో నిపుణులు, విపక్షాలు హెచ్చరించినా ప్రభుత్వం అప్రమత్తం కాలేదు. ఎండలు పెరిగితే కరోనా చనిపోతుందని, మాస్కులు ధరించాల్సిన అవసరమే ఉండదని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే రోజురోజుకీ కేసుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైనా అప్పటికే ఆలస్యమైంది. హైదరాబాద్లో గాంధీతో పాటు మరో 4 హాస్సిటళ్లను కోవిడ్ ఆసుపత్రులుగా మార్చినా అవి ఏమూలకూ చాలని పరిస్థితి ఎదురైంది. జిల్లాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో కరోనా పేషెంట్లు హైదరాబాద్కే రావాల్సి వచ్చింది. వైద్య సిబ్బందికి కల్పించాల్సిన వసతులు సకాలంలో కల్పించకపోవడంతో వారు నిరసనలకు దిగారు. అంతేకాదు కరోనా విషయంలో ప్రజలకు నిజాలు తెలియనీకుండా కేసులు, మరణాల లెక్కను ప్రభుత్వం దాచేసింది. దీనిపై హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ఒకరిద్దరు సీనియర్ అధికారులను బదిలీ చేసి చేతులు దులుపుకొన్నారు. సెక్రటేరియట్ కూల్చేసి… కరోనా కష్టకాలంలో ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాల్సిన సర్కారు గొప్పలకు పోయింది. సెక్రటేరియట్ కూల్చి తన పంతాన్ని నెగ్గించుకుంది. డబ్బులు లేవంటూ నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, పెన్షన్ల పెంపు లాంటి హామీల అమలును పెండింగ్ లో పెట్టిన సర్కారు.. దాదాపు రూ.వెయ్యి కోట్లతో కొత్త సచివాలయ నిర్మాణానికి మాత్రం వెనుకాడలేదు. తాత్కాలిక సచివాలయంగా మారిన బీఆర్కే భవన్ సరిపోక ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రాంతానికి ఒక శాఖను తరలించడంతో పాలనకు కేంద్ర బిందువు లేక సమన్వయం కొరవడింది. మొండిగా నిర్ణయాలు.. తర్వాత యూటర్న్స్ అవినీతిని అంతం చేస్తామంటూ కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చింది కేసీఆర్ సర్కారు. అసెంబ్లీలో సమగ్ర చర్చ లేకుండా.. విపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా మొండిగా ఆమోదించిన చట్టం పెద్ద ఫెయిల్యూర్ గా మిగిలింది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి దాని స్థానంలో ఆల్టర్నేటివ్ ను చూపించకపోవడంతో భూవివాదాలు పెరిగిపోయాయి. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల కోసం రూపొందించిన ధరణి పోర్టల్ మరింత వివాదస్పదమైంది. మూడు నెలల పాటు రిజిస్టేషన్లు నిలిపి వేసినా కొత్త విధానం సక్సెస్ కాలేదు. హైకోర్టు ఆంక్షితలు,  ప్రజల ఒత్తిడికి తలొగ్గి పాత విధానంలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కొనసాగించేందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక ప్రభుత్వం 2020లో చేసిన అతి పెద్ద పొరబాటు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్). ప్రతి ఇంటి స్థలానికి ఎల్ఆర్ఎస్ ఉండాల్సిందేనంటూ చేపట్టిన అనాలోచిత చర్య ప్రజలకు శాపంగా మారింది. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమికి ఇప్పటి మార్కెట్ ధరకు అనుగుణంగా సర్కారు నిర్ణయించిన అమౌంట్ కట్టాల్సి రావడంతో ప్రజలు భగ్గుమన్నారు. రిజిస్ట్రర్ అయిన భూమిని కూడా అనధికార, అక్రమ భూమి అనడంతో ఓనర్లు తల్లడిల్లిపోయారు. ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎల్ఆర్ఎస్ తెచ్చిందని , దాన్ని రద్దు చేయాలని నిరసనలకు దిగే పరిస్థితి వచ్చింది. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హమీల అమలును సీఎం కేసీఆర్ మొత్తంగా గాలికొదిలేశారు. ఉద్యోగాల భర్తీని అస్సలు పట్టించుకోలేదు. కొలువులొచ్చే వరకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇంత వరకు అడ్రస్ లేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం విషయంలో చెప్పలేనంత నిర్లక్ష్యం ప్రదర్శించింది. లక్ష ఇండ్లు లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పి, గ్రేటర్ ఎన్నికల ముందు ప్రచార ఆర్బాటం చేయడం మినహా ఫలితం శూన్యం. నీళ్లు, నిధులు, నియామకాలు.. ఏవీ లేవ్ తెలంగాణ రాష్ట్ర పోరాటానికి కారణమే.. స్వరాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాల్లో మన వాటాను దోపిడీకి గురికాకుండా కాపాడుకోవచ్చన్న ఆలోచన. రాష్ట్రం వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ ఇవాళ అప్పుల కుప్పగా మారింది. పైగా చేసిన అభివృద్ధి ఎక్కడా కనిపించదు. అప్పులు చేసి తెచ్చిన లక్షల కోట్ల డబ్బు ఏమైందో తెలియదు. మరోవైపు సర్పంచ్లకు పవర్  లేకుండా చేశారు. నిధులు అందనీయలేదు. వారికి అధికారాలను బదిలీ చేయలేదు. దీంతో ఊరిని అభివృద్ధి చేయలేక, లోకల్ గా ప్రజల ఒత్తిడిని ఫేస్ చేయలేక ఇద్దరు సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ విషయం అసలు చెప్పక్కర్లేదు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో ఏడాది చివరిలో హంగామా మొదలుపెట్టారు సీఎం కేసీఆర్. ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం ఎత్తిపోతల ద్వారా కృష్ణా నీళ్లు తరలించుకుని, దక్షిణ తెలంగాణను ఎడారి చేసే ప్రయత్నం మొదలుపెడితే సీఎం కేసీఆర్ అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారు. మొత్తంగా 2020 సంవత్సరం మొత్తం కేసీఆర్ పాలన పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. కనీసం కొత్త ఏడాదిలోనైనా ప్రజలకు మంచి చేసేలా పాలన చేయాలని అంతా కోరుకుంటున్నారు. రైతుల్ని ఆగం చేసిన్రు సీఎం కేసీఆర్ 2020లో తన అనాలోచిత నిర్ణయాలతో రైతులను ఆగం చేశారు. నియంత్రిత సాగు పేరుతో రైతులకు ఏ పంట వేయాలన్నది సర్కారు డిక్టేట్ చేయాలన్న విధానం పూర్తిగా ఫెయిల్ అయింది. తాము చెప్పిన పంట వేయకపోతే రైతు బంధు కూడా ఇవ్వబోమని బెదిరించి మరీ.. 40 లక్షల ఎకరాల్లో రైతులతో సన్న వడ్లను సాగు చేయించింది. కానీ చివరికి మద్దతు ధర ఇవ్వలేదు. సర్కారు కొనుగోలు చేయలేదు. కరోనా సమయంలో మార్కెట్ యార్డులు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాలని హడావుడిచేసిన ప్రభుత్వం ఆ తర్వాత వాటిని ఎత్తేసింది. ఆరు వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానిదే అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి.. ఇప్పుడు చేతులెత్తేశారు. కొనుగోలు కేంద్రాల వల్ల ప్రభుత్వానికి రూ.7500 కోట్ల నష్టం వచ్చిందని అనడం రైతులను అవమానించడమే. కొన్ని జిల్లాల్లో పంట చేతికొచ్చే వేళ అక్టోబర్ లో అకాల వర్షాలు కురిసి పంట నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వచ్చినా ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి ఆదుకున్న పాపాన పోలేదు. –డాక్టర్ పారుపల్లి శ్రీనివాసరావు ,ప్రొఫెసర్, హైదరాబాద్