
నల్లగొండ జిల్లాలో రంగురాళ్ల మాఫియా రెచ్చిపోతుంది. రైతుల పంట పొలాలకు సాగు నీరందించే పంట కాలువను రంగు రాళ్ల కోసం కొంతమంది త్వుతున్నారు. కాలువను ధ్వంసం చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కాల్వ మధ్యలో లోతైన గోతులు తీస్తున్నారు. నకిరేకల్ ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో రంగురాళ్ల కోసం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. భూగర్భ జలాలను పెంచి ఈ ప్రాంతానికి సాగు నీరు అందిస్తున్న ఏఎమ్మార్పీ కాల్వ అక్రమ తవ్వకాలతో రూపు కోల్పోతోంది.
పుట్టగండిలో మొదలైన ఏఎమ్మార్పీ కాలువ 135 కిలో మీటర్లు పొడవు ఉంది. నకిరేకల్ మండలం నడిగూడెం గ్రామం దగ్గర మూసీ జలాశయంలో కలుస్తుంది. కాలువ చివరి ప్రాంతాలైన నకిరేకల్... కేతేపల్లి మండలాల సరిహద్దుల్లో రంగు రాళ్ల (క్వార్ట్జ్ ఖనిజం) కోసం కొన్ని రోజులుగా రాత్రికి రాత్రే తవ్వకాలు జరుపుతున్నారు. ప్రస్తుతం కాలువ ద్వారా నీటి ప్రవాహం లేకపోవడంతో ఈ కాలువలో 125 కిలోమీటర్ల నుంచి 127 కిలో మీటర్ల వరకు లోతుగా తవ్వుతున్నారు.
సుద్ద నేలలున్న ఈ ప్రాంతాల్లో తెలుపు... కొద్దిగా ఎరుపు ..ఆకుపచ్చ రంగుల్లో ఉన్న రాళ్ల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతంలో దొరికిన రాళ్లను రూ. 400 కు కొనుగోలు చేసిన వ్యాపారులు.. నల్లగొండ.. భువనగిరి.. వరంగల్ కు తరలిస్తున్న దళారులు రూ. 800 వరకు అమ్ముతున్నారు. సాగు నీటి కోసం ఏర్పాటు చేసిన కాలువను ధ్వంసం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.