ఎన్నారైపై దుండగుల కాల్పులు

ఎన్నారైపై దుండగుల కాల్పులు
  • తల, మెడపై బుల్లెట్ గాయాలు.. పంజాబ్‌‌‌‌లో ఘటన

చండీగఢ్: పంజాబ్‌‌‌‌లో దారుణం జరిగింది. అమృత్‌‌‌‌సర్ జిల్లా డబుర్జి గ్రామంలో నివసిస్తున్న ఓ ఎన్నారైపై ఇద్దరు దుండగులు పాయింట్ -బ్లాంక్ రేంజ్‌‌‌‌లో కాల్పులు జరిపారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అమెరికాకు చెందిన సుఖ్‌‌‌‌చైన్ సింగ్ అనే ఎన్నారై నెల క్రితం తన కుటుంబంతో సహా డబుర్జికి వచ్చారు. ఓ హోటల్, లగ్జరీ కారు కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తలపాగా ధరించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైకుపై సుఖ్‌‌‌‌చైన్ సింగ్ ఇంటికి వచ్చారు. 

లగ్జరీ కారు గురించి మాట్లాడాలనే నెపంతో ఇంట్లోకి ప్రవేశించారు. హఠాత్తుగా దుండగుల్లో ఒకరు సుఖ్‌‌‌‌చైన్ సింగ్​ను బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌లోకి వెళ్లాలని తుపాకీతో బెదిరించాడు. దానికి సుఖ్‌‌‌‌చైన్ సింగ్ నిరాకరించడంతో అతనిపై ఇద్దరు దుండగులు పాయింట్- బ్లాంక్ రేంజ్‌‌‌‌లో కాల్పులు జరిపారు. తల, మెడపై బుల్లెట్ గాయాలయ్యాయి. ఎన్నారై కుటుంబసభ్యులు దండం పెట్టి ప్రాధేయపడినా దుండగులు పట్టించుకోలేదు. కాల్పులు జరిపి బైకుపై పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన సుఖ్‌‌‌‌చైన్ సింగ్​ను స్థానికులు వెంటనే అమృత్‌‌‌‌సర్‌‌‌‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు సంబంధించిన దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి.