చీకోటి ప్రవీణ్ ఇంటి వద్ద దుండగుల రెక్కీ..!

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఇంటి వద్ద దుండగుల రెక్కీ కలకలం రేపుతోంది. చీకోటి ప్రవీణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించింది ఎవరు..? ప్రస్తుతం ఈ కేసును తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. చీకోటి ప్రవీణ్.. గత సంవత్సరం సంక్రాంత్రి సంబరాల్లో గోవా తరహాలో క్యాసినో ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఓ కుదుపు కుదేశాడు. తాజాగా చీకోటి ప్రవీణ్ ఇంటి వద్ద కొంతమంది రెక్కీ నిర్వహించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దుండగులు గత వారం రోజులుగా చీకోటి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. ఈనెల 19న అర్థరాత్రి, 20న తెల్లవారుజామున రెక్కీ నిర్వహించినట్లు సీసీ టీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. 

మరోవైపు.. చీకోటి ప్రవీణ్ కారును దుండగులు చోరీ చేశారని తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో ప్రవీణ్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమైన గుర్తు తెలియని వ్యక్తులు..అపార్ట్ మెంట్ లో పార్కింగ్ లో ఉన్న కారును ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చీకోటి ప్రవీణ్ ఫిర్యాదుతో సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ప్రస్తుతం సైదాబాద్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గతంలో కూడా చాలాసార్లు అనుమానాస్పదంగా కొంతమంది యువకులు తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని చీకోటి ప్రవీణ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.