రిమ్స్​లో దుండగుల హల్​చల్.. డైరెక్టర్ ​ఫ్యాన్స్​ అంటూ హౌస్​ సర్జన్లపై దాడి

  • కారుతో కాలేజ్​ గేట్​ డ్యాష్​ ఇచ్చి  మరీ లోపలకు...
  • పేరు పెట్టి పిలిచి మరీ దాడి
  • అడ్డొచ్చిన మరికొందరికి గాయాలు ​
  • ప్రతిదాడిలో గాయపడ్డ నిందితుడు  
  • డ్యూటీలు బహిష్కరించిన మెడికోలు
  • కలెక్టరేట్ ​ఎదుట  ధర్నా
  • బాధ్యుడిని టెర్మినేట్​ చేస్తూ  ఆర్డర్స్

ఆదిలాబాద్​టౌన్, వెలుగు : ఆదిలాబాద్ ​జిల్లా కేంద్రంలోని రిమ్స్​లో బుధవారం అర్ధరాత్రి అసిస్టెంట్​ ప్రొఫెసర్​ స్థాయి కాంట్రాక్ట్​ ఫ్యాకల్టీ ఒకరు ఆగంతకులతో కలిసి హల్​చల్ చేశాడు. హౌస్​సర్జన్లపై దాడి చేసి గాయపరిచాడు. దీంతో బాధితులు, మెడికోలు కలెక్టరేట్​ఎదుట ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు బాధ్యులను అరెస్ట్ చేయడంతో పాటు ప్రధాన నిందితుడిని టెర్మినేట్​చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బాధితుల  కథనం ప్రకారం..కొద్ది రోజుల కింద రిమ్స్​దవాఖానలో సమస్యలపై డైరెక్టర్ ​జైసింగ్​రాథోడ్​ను హౌస్​సర్జన్లు ప్రశ్నించారు. ఇది మనసులో పెట్టుకున్న డైరెక్టర్, ఇతడి బంధువైన అసిస్టెంట్​ ప్రొఫెసర్, డాక్టర్ ​క్రాంతికుమార్​ కోపం పెంచుకున్నారు. అప్పుడే డాక్టర్​ క్రాంతి స్నేహితుడైన వాసిమ్ ​అనే రౌడీషీటర్ ​రిమ్స్​కు వచ్చి ఓ హౌస్​సర్జన్ ​గల్లా పట్టుకున్నాడు. తర్వాత డాక్టర్ ​క్రాంతికుమారే గొడవలు ఎందుకంటూ కాంప్రమైజ్​ చేశాడు. అంతా సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు డాక్టర్ ​క్రాంతి కుమార్, రౌడీషీటర్ ​వాసిమ్, శివ, సాయికృష్ణ, వెంకటేశ్, శ్రీకాంత్​కలిసి ​కారులో రిమ్స్​ కాలేజ్ గేటును తోసుకుంటూ హాస్టల్ ​కంపౌండ్​లోకి చొరబడ్డారు. ‘ఇక్కడ డాక్టర్​ కవిరాజు ఎవడ్రా?’ అని ప్రశ్నించడంతో తానేనంటూ ముందుకు వచ్చాడు. దీంతో అతడిని కొట్టడం మొదలుపెట్టారు. ఇది చూసిన అక్కడే ఉన్న కొందరు హౌస్​సర్జన్లు మీరెవరని ప్రశ్నిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ‘మేం రిమ్స్​ డైరెక్టర్ ఫ్యాన్స్ రా..’ అంటూ మరింత రెచ్చిపోయారు. దాడిలో డాక్టర్లు టి.కవిరాజ్​తో పాటు పెండెం నవీన్, భరత్, పి.నవీన్, విజయ్, అభిషేక్​కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మరికొంతమంది మెడికోలు అక్కడికి చేరుకొని దాడి చేస్తున్నవారిని ధీటుగా ఎదుర్కొన్నారు. దీంతో నిందితుల్లో ఒకడైన శివ కూడా గాయపడ్డాడు. ఈ క్రమంలో నిందితులు కారుతో ఢీకొట్టడంతో ఎగిరిపడ్డ డాక్టర్ ​పి.నవీన్ కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని నిందితులను అరెస్టు చేసి టూటౌన్​ స్టేషన్​కు తరలించారు. సోమవారం ఐదుగురిని రిమాండ్​ చేశారు.

కలెక్టరేట్ ​ఎదుట ధర్నా

దాడిని నిరసిస్తూ హౌస్​ సర్జన్లు, పీజీ డాక్టర్లు సుమారు 300 మంది గురువారం ఉదయం డ్యూటీలు బహిష్కరించి ఆందోళనకు దిగారు. డైరెక్టర్ ​జైసింగ్ ​రాథోడ్, డాక్టర్ ​క్రాంతికుమార్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని బైఠాయించారు. డైరెక్టర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న మద్దతు పలికి ధర్నాలో కూర్చున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో కలెక్టర్​ రాహుల్​ రాజ్​ బయటకు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పినా వారు వినలేదు. వెంటనే డైరెక్టర్​ను మార్చాలని డిమాండ్ ​చేశారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారని, అడిషనల్ ​కలెక్టర్ ​శ్యామలాదేవితో విచారణ జరిపి ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదని చెప్పడంతో శాంతించారు. ఇది జరిగిన కొద్ది సేపటికే డైరెక్టర్ ​జైసింగ్​ రాథోడ్ ​రిమ్స్​లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. డా.క్రాంతికుమార్​ను టెర్మినేట్​ చేస్తున్నట్టు ప్రకటించారు.10 మంది డాక్టర్లతో కమిటీ వేసి విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు అడిషనల్​ కలెక్టర్ ​శ్యామలాదేవి ఆలస్యం చేయకుండా రిమ్స్​కు చేరుకుని ఘటనపై విచారణ జరిపారు. గాయపడిన డా.తాళ్లపెల్లి కవిరాజ్ ​ఫిర్యాదు మేరకు డా.క్రాంతికుమార్, వాసిం, శివతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.​