- ఈ ప్రాంతంలో భారీ ప్రాజెక్టులకు హెచ్ఎండీఏ ప్లాన్
- ఫార్మాసిటీ రద్దుతో టౌన్షిప్ ల డెవలప్ కు కసరత్తు
- రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ప్రాంతానికి పెరిగిన ప్రాధాన్యం
- భారీ భవన నిర్మాణాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు రాక
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ సిటీ పరిధి తుక్కుగూడ, శ్రీశైలం రూట్ లో రియల్ఎస్టేట్ పుంజుకోవడంతో భారీ నిర్మాణాల జోరు పెరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. తుక్కుగూడ తమకు కలిసి వచ్చిన ప్రాంతమని, ఇప్పటికే పలు ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతూ వచ్చారు. తాజాగా ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే ప్రసిద్ధి చెందిన ప్రముఖ విద్యాసంస్థలు ఉండడం, పెద్ద సంఖ్యలో విల్లాలు, ఫామ్‌హౌస్ నిర్మాణాలు చేపడుతుండగా అభివృద్ధిలో వేగంగా దూసుకెళ్తోంది. ప్రభుత్వం భవిష్యత్‌లో ఏర్పాటు చేయబోయే పలు క్లస్టర్లకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా ఉండబోతోంది. దీంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరిగే చాన్స్ ఉందనే రియల్ ఎస్టేట్ వర్గాల అంచనాలతో అప్పుడే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఔటర్ కూడా ఉండడంతో భవిష్యత్ లో మరింత డెవలప్ కానుంది. ఇప్పటికే చాలా మంది భూములు కూడా కొనుగోలు చేస్తుండగా.. తుక్కుగూడ, శ్రీశైలం రూట్ లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి స్పీడ్ అందుకున్నట్టు రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఎందుకంటే..
తుక్కుగూడ, శ్రీశైలం రూట్ లో స్పీడ్ గా అభివృద్ధికి ప్రధానంగా అనేక సౌకర్యాలు కారణంగా ఉన్నాయి. ఫార్మాసిటీ ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రద్దు చేసింది. దాని స్థానంలో భారీ ఎత్తున ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో టౌన్‌షిప్‌ల నిర్మాణానికి హెచ్ఎండీఏ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంతం విల్లాలకు చిరునామాగా ఉంది. ఫామ్ ల్యాండ్స్, పెద్ద పెద్ద లే ఔట్స్ కూడా వస్తున్నాయి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నం. 14 ఉండగా భారీ నిర్మాణాలు నిర్మితమవుతున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు సమీపంలోని ప్రాంతం కావడంతో మరింత ప్రాధాన్యత పెరిగింది.
ఇక్కడ నిర్మించిన ఫ్యాబ్‌సిటీలో ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. తుక్కుగూడ నుంచి శ్రీశైలం వెళ్లే రూట్ లో టౌన్‌షిప్‌లు, ప్రముఖ విద్యా సంస్థలు, విల్లాలు ఎక్కువగా ఉన్నాయి. లేమూరులో హెచ్ఎండీఏ వెంచర్లతో ప్రైవేట్ నిర్మాణ సంస్థలు పెద్దఎత్తున లే ఔట్లు చేశాయి. తద్వారా భవిష్యత్‌లో ఎక్కువ అభివృద్ధి జరిగే ప్రాంతమని రియల్ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.
ఫార్మాసిటీ స్థానంలో టౌన్షిప్ లు
ఫార్మాసిటీ నిర్మాణాన్ని ప్రభుత్వం రద్దు చేయగా.. ఇప్పటికే కందుకూరు చుట్టుపక్కల ఫార్మాసిటీ పేరుతో వెంచర్లు, టౌన్షిప్ ప్రాజెక్టులు వచ్చాయి. హెచ్ఎండీఏ కూడా టౌన్‌షిప్‌ల నిర్మాణాన్ని ప్రోత్సహించడమే కాకుండా ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించేందుకు సిద్ధమవుతోంది. రీజినల్ రింగ్ రోడ్ (త్రిబుల్ ఆర్) నిర్మాణ ప్రతిపాదనలతోనూ రియల్ ఎస్టేట్ మరింత పుంజుకుంటోంది. త్రిబుల్ ఆర్ పేరుతో పెద్ద సంఖ్యలో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఆమన్‌గల్, మైసిగండి, కడ్తాల్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పలు చోట్ల లేఔట్లు వచ్చాయి.
ఇంటిగ్రేటెడ్ సిటీగా అభివృద్ధి
రియల్ఎస్టేట్వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది నిర్మాణదారులు ఇంటిగ్రేటెడ్ సిటీలను అభివృద్ధి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టౌన్‌షిప్‌లను పోలి ఉండే వాటిని 250 ఎకరాల నుంచి వెయ్యి ఎకరాల్లో నిర్మించేందుకు తగు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఓపెన్ ప్లాట్లు, విల్లా ప్లాట్స్, వాణిజ్య అవసరాలకు తగిన స్థలాలను ప్రత్యేకంగా విభజించి అమ్మకాలు చేస్తున్నారు. ముఖ్యంగా స్కూల్స్, ప్లేగ్రౌండ్స్, హాస్పిటల్స్, ఎంటర్ టైన్ మెంట్, కమ్యూనిటీ కేంద్రాలు వంటి సౌకర్యాలను కల్పించేలా నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
భారీ భవనాలు, అపార్ట్మెంట్స్ నిర్మాణాలకు కూడా హెచ్ఎండీఏకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ఆర్ వరకు దాదాపు భారీ ప్రాజెక్టులు వచ్చే చాన్స్ ఉన్నట్టు పేర్కొన్నారు. దీంతో రాబోయే రోజుల్లో తుక్కుగూడ, శ్రీశైలం రూట్ ఖరీదైన ప్రాంతాలుగా మార్పుచెందనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.