ఖమ్మం, వెలుగు: సీఎం కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే మాట్లాడుతారని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుతో మాట్లాడి కేసీఆర్‌కు తానే మంత్రి పదవి ఇప్పించానని చెప్పారు. ముందు ఫారెస్ట్ మినిస్ట్రీ ఇస్తే.. చంద్రబాబును రిక్వెస్ట్ చేసి ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఇప్పించానన్నారు. ఇప్పుడు కేసీఆర్ గతం మర్చిపోయి మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఖమ్మం 54వ డివిజన్ లోని సంస్కృతి అపార్ట్మెంట్లో ఆదివారం నిర్వ హించిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడారు. ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లకు తుమ్మల కౌంటర్ ఇచ్చారు. ‘‘నేను రిక్వెస్ట్ చేస్తేనే కేసీఆర్‌కు చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. నేను మంత్రి పదవి ఇప్పించానో.. లేదో.. చంద్రబాబును అడిగితే తెలుస్తది. గతం మరిచిపోయి కేసీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నడు. టీడీపీలో కేసీఆర్ ఎక్కడో ఓ మూలన కూర్చుంటుండే.. నేను చంద్రబాబుతో మాట్లాడి మంత్రిని చేయించా. ఫారెస్ట్ మినిస్ట్రీ ఇష్టం లేదంటే.. చంద్రబాబుతో మాట్లాడి ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఇప్పించింది నిజం కాదా?”అని కేసీఆర్‌ను తుమ్మల నిలదీశారు.
పువ్వాడ.. పూజకు పనికి రాని పువ్వు
మంత్రి పువ్వాడ అజయ్.. పూజకు పనికిరాని పువ్వు అని తుమ్మల నాగేశ్వర రావు ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టు పార్టీ కుటుంబంలో పుట్టిన పువ్వాడ.. నాలుగు పార్టీలు మారారని విమర్శించారు. తండ్రి పరువు తీశాడని అన్నారు. ‘‘కేసీఆర్ 3నెలలు బతిమాలితేనే.. టీఆర్ఎస్లో చేరినట్లు పువ్వాడ చెప్పుకుంటున్నడు. పువ్వాడ అజయ్.. వయ్యారి భామ లాంటి పువ్వు. అది ఎలాగైతే పూజకు పనికి రాదో.. అచ్చం అలాంటి పరిస్థితే అజయ్‌ది. తుమ్మ చెట్టు ముదిరితే నీళ్లు లేకుండా కూడా బతుకుతది. రైతుకు అన్నం పెట్టేందుకు తుమ్మ చెట్టు పనికొస్తది. అజయ్‌కు మెడకాయ మీద.. తలకాయ లేదు. అందుకే ఇరుకుగా ఉన్న బస్ డిపో రోడ్లో సెంట్రల్ లైటింగ్ వేసిండు”అని తుమ్మల నాగేశ్వర రావు ఫైర్ అయ్యారు. గోళ్లపాడు చానల్ పనుల్లో అజయ్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తాను హైవేలపై లైట్లు పెడితే.. కమీషన్ల కోసం సందుల్లో లైట్లు పెట్టిన అవినీతిపరుడు అజయ్ అని విమర్శించారు. ఎన్నికల్లో పువ్వాడను ఓటర్లు 14 అడుగుల గోతిలో పాతిపెడ్తరన్నారు.