తుమ్మలకు ఎమ్మెల్సీ ఆఫర్!

ఖమ్మం, వెలుగు : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్సీ ఆఫర్ వచ్చింది. ఈ నెల 3న రాత్రికల్లా హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని సీఎం కేసీఆర్ నుంచి కబురు అందినట్లు తెలుస్తోంది. జనవరి 18న ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ముందు ఇచ్చిన హామీలో భాగంగానే తుమ్మలకు ఎమ్మెల్సీ ఆఫర్ వచ్చినట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. కానీ ఎమ్మెల్సీ ఆఫర్​ను తుమ్మల సున్నితంగా తిరస్కరించారని, తాను రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచే ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తానని హైకమాండ్​కు తేల్చి చెప్పినట్లు కూడా చర్చ జరుగుతోంది. అయితే, పొత్తుల్లో భాగంగా పాలేరు సీటును సీపీఎంకు అప్పగించే ఆలోచనలో హైకమాండ్​ ఉన్నందునే తుమ్మలను సైడ్ చేస్తోందని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీంతో ఈ నెల 3న గానీ, 4న గానీ తుమ్మల హైదరాబాద్ వెళ్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.   

విభేదాలు తగ్గించేందుకే.. 

3 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతు న్నాయి. ఇందులో భాగంగానే ఒక సీటును తుమ్మలకు ఆఫర్ చేశారని సమాచారం. మాజీ ఎంపీ పొంగులేటి పార్టీ మార్పు ఆలోచనలో ఉండడంతో జరిగే నష్టాన్ని తగ్గించడం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్​ను బలోపేతం చేయడంలో భాగంగా, వివిధ ఈక్వేషన్లను పరిగణనలోకి తీసుకుని తుమ్మలను ఎమ్మెల్సీ సీటుకు ఒప్పించేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. తుమ్మల 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కందాల టీఆర్ఎస్ లో చేరడంతో ఇద్దరి మధ్య వర్గ పోరు మొదలైంది. వీళ్ల మధ్య విభేదాలను తగ్గించి, ఒక్క తాటిపైకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. ఇటీవల పొంగులేటి పార్టీ మార్పు అంశం తెరపైకి రావడంతో, పార్టీలో తుమ్మలకు ప్రయారిటీ పెరిగింది. ఈ నేపథ్యంలో తుమ్మలను ఎమ్మెల్సీగా పంపి, కందాలకు, ఆయనకు మధ్య విభేదాలను తొలగించాలని, ఎన్నికల నాటికి వర్గపోరు లేకుండా చేయాలని పార్టీ హైకమాండ్ ఆలోచిస్తున్నది. అయితే, ఎమ్మెల్సీ పదవి వద్దని, పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీకే సిద్ధమని తుమ్మల పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. 

పాలేరు సీటు సీపీఎంకే? 

పొత్తులో భాగంగా పాలేరు అసెంబ్లీ సీటును సీపీఎంకు కేటాయించే అవకాశం ఉందని కొన్ని నెలలుగా ప్రచారం సాగుతోంది. సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్​లోనే కందాల, తుమ్మల టికెట్ కోసం పోటీ పడుతుండగా అదే స్థానంలో సీపీఎం నుంచి తమ్మినేని టికె ట్ ఆశిస్తుండడం ఆసక్తికరంగా మారింది. తమ్మినేని సొంత ఊరు తెల్దారుపల్లి కూడా ఇదే నియోజకవర్గ పరిధిలోనే ఉంది. దీంతో తమ్మినేని కోసం పాలేరు టికెట్ ఇచ్చేందుకు వీలుగా ముందుగానే ఎమ్మెల్సీ సీటిచ్చి తుమ్మలను సైడ్ చేసేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసిందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.