ఈ వేసవిలో నేతుమ్మిడి హెట్టి పనులు

ఈ వేసవిలో నేతుమ్మిడి హెట్టి పనులు
  • మహారాష్ట్ర సీఎంతో మాట్లాడుతం: మంత్రి ఉత్తమ్  
  • ఏప్రిల్‌‌లో సీఎంతో కలిసి వెళ్తాం, వేసవిలో పనులు ప్రారంభిస్తం 
  • సీతారామ ప్రాజెక్టు వ్యయం పెరిగింది
  • ప్రాథమిక నివేదిక కంటే రెట్టింపు భూసేకరణ  
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రెండేండ్లలో సాగునీరు అందిస్తామని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లాలోని ప్రాణహిత నదిపై ప్రతిపాదిత తుమ్మడిహెట్టి వద్ద  ప్రాజెక్టు నిర్మాణ పనులను ఈ వేసవిలోనే ప్రారంభిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌ ‌‌రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ఏప్రిల్‌‌లో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డితో కలిసి మహారాష్ట్ర సీఎంతోపాటు అక్కడి నీటిపారుదల శాఖ అధికారులతో చర్చిస్తామన్నారు.

 ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటి సరఫరా కోసం తుమ్మడిహెట్టి సహా వివిధ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. సోమవారం మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల్లో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు, తుమ్మడిహెట్టి నిర్మాణం పనులపై తాతామధు, జీవన్‌‌రెడ్డి, ప్రొఫెసర్ ​కోదండరాం, తీన్మార్ మల్లన్న అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. 

సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే నిధుల అంచనాలు పెరగడాన్ని ఆయన వివరిస్తూ.. ఒరిజినల్​ప్రాథమిక ప్రాజెక్టు నివేదికలో డిస్ట్రిబ్యూటరీ నెట్‌‌వర్క్స్ కు అవసరమైన భూమి వివరాలు, విద్యుత్‌‌ సబ్‌‌స్టేషన్లకు అవసరమైన నిధుల గురించి ప్రస్తావించలేదన్నారు. దీంతోపాటు జీఎస్టీ 4 నుంచి 8 శాతం పెరగడంతో అంచనాలు కూడా పెరిగాయని తెలిపారు.

రెట్టింపు భూసేకరణ చేయాల్సి ఉంది

ప్రాథమిక నివేదికలో 9 వేల ఎకరాల భూ సేకరణ చేపట్టాల్సి ఉండగా ప్రస్తుతం 18 వేల ఎకరాలు అవసరం కానుందన్నారు. అదనపు భూసేకరణ, విద్యుత్ సబ్ స్టేషన్లు, పెరిగిన జీఎస్‌‌టీతో రూ.13,057 కోట్ల నుంచి రూ.19,465 కోట్లకు  అంచనాలు పెరిగాయన్నారు. 

సీతారామ ప్రాజెక్టుకు114 కిలో మీటర్ల మెయిన్ కెనాల్‌‌ పూర్తి చేయాల్సిఉండగా 104 కిలో మీటర్ల పనులు పూర్తయ్యాయన్నారు. మూడు పంప్ హౌజ్‌‌ల నిర్మాణాలు కూడా పూర్త చేసినట్టు చెప్పారు. పాలేరు లింక్ కెనాల్ పనులు 32 శాతం పూర్తయ్యాయని, డిస్ట్రిబ్యూటరీ  నెట్‌‌వర్క్స్ కు సంబంధించిన 8 ప్యాకేజీ లకు 4 ప్యాకేజీ పనులకు టెండర్లు పిలిచామని, మరో మూడు ప్యాకేజీలకు ఆమోదం లభించిందన్నారు. రాజీవ్ లింక్ కెనాల్ 18 ఎల్ పూర్తి అయిందని స్పష్టం చేశారు.

రెండేండ్లలో ప్రాజెక్టును  పూర్తి చేస్తం

రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని మంత్రి చెప్పారు. రెండేండ్లలో  పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు అంశంపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. 2024–-25 ఖరీఫ్ సీజన్‌‌లో 156.20 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యిందని, అందులో 53.93 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. ఇందుకు రూ.12,511.76 కోట్లు రైతులకు చెల్లించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఖరీఫ్‌‌, రబీ సీజన్లకు బదులు వానాకాలం, యాసంగిగా వ్యవహరించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.