సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించకపోతే వచ్చే నష్టం ఏముందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రశ్నించారు. ‘‘సెప్టెంబర్ 17 న జెండా ఎగరేస్తే ఏంటీ ? ఎగరేయకపోతే ఏంటీ ? మొన్నటివరకు మీరు జాతీయ జెండా ఎగురవేశారా ? ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో 2000 వరకు జాతీయ జెండానే ఎగురవేయలేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు మతాలకు అతీతంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్న రాష్ట్రంలో బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోందని గాదరి కిషోర్ అన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకపోవడంతో సహా మిషన్ భగీరథకు నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణలో వరదలొస్తే పట్టించుకోని కేంద్రం.. గుజరాత్ కు మాత్రం ముందస్తు నిధులు ఇచ్చిందని ఆరోపించారు. బీజేపీ నేతలు తమ ఆత్మగౌరవాన్ని అమిత్ షా కాళ్ల దగ్గర పెట్టారని విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప బీజేపీ చేసే అభివృద్ధి ఏమీ లేదన్నారు. బిల్కిస్ బానో కేసులో 11మంది దోషులను విడుదల చేసిన చరిత్ర బీజేపీదన్నారు.