మహిళలను వేధిస్తున్న థైరాయిడ్​, మెనోపాజ్​

మహిళలను వేధిస్తున్న థైరాయిడ్​, మెనోపాజ్​
  • ఉమెన్ క్లినిక్ టెస్టుల్లో బయటపడ్తున్న సమస్యలు

హైదరాబాద్, వెలుగు: మహిళల్లో వివిధ రకాల వ్యాధులను ముందస్తుగా గుర్తించి చికిత్స​అందించేందుకు సర్కారు ఏర్పాటు చేసిన మహిళా క్లినిక్ లకు ఆదరణ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళా క్లినిక్ లలో 2023 మార్చి నుంచి 2024 డిసెంబర్ వరకూ 29 లక్షలకుపైగా మహిళలకు 8 రకాల టెస్టులు ఉచితంగా నిర్వహించారు. వీరిలో 401 మందికి ప్రాణాంతక క్యాన్సర్‌‌‌‌లు బయటపడగా.. మిగతా వారికి వివిధ సమస్యలు ఉన్నట్టు నిర్ధారించారు. ఇప్పటివరకు చేసిన పరీక్షల్లో మహిళలకు గర్భాశయ, రొమ్ము, నోటి క్యాన్సర్లతో పాటు థైరాయిడ్ సమస్యలు, యూరినరీ ఇన్​ఫెక్షన్లు, పీరియడ్స్, పీసీవోడీ సమస్యలు, లైంగిక వ్యాధులు వెలుగుచూస్తున్నాయి. ఆయా వ్యాధుల పట్ల మహిళలకు అవగాహన కల్పిస్తున్న డాక్టర్లు, వ్యాధి నిర్ధారణ అయిన వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సమస్య తీవ్రంగా ఉంటే పై ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్స్, వెల్​నెస్ సెంటర్లు, జిల్లా హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్​లో మొత్తం 372 చోట్ల మహిళా క్లినిక్ లు ఏర్పాటు చేశారు. వీటిలో వారానికి ఒకరోజు (మంగళవారం) వైద్య సేవలు అందుతున్నాయి.  

401 మందికి క్యాన్సర్.. 

క్యాన్సర్​లాంటి ప్రాణాంతక వ్యాధిని తొలిదశలోనే గుర్తించి ట్రీట్మెంట్ అందిస్తే నయం చేసేందుకు అవకాశం ఉంటుంది. అందుకే మహిళా క్లినిక్ లలో 2023 మార్చి నుంచి 2024 డిసెంబర్ వరకు మొత్తం 29,19,872 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ సహా వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. వీరిలో18,539 మందిని క్యాన్సర్ అనుమానితులుగా గుర్తించారు. వారికి మరిన్ని పరీక్షలు చేశారు. చివరగా వీరిలో 401 మందికి క్యాన్సర్​సోకినట్టు నిర్ధారించారు. వీరిలో నోటి క్యాన్సర్​తో 33 మంది, రొమ్ము క్యాన్సర్​తో 155 మంది, గర్భాశయ క్యాన్సర్​తో 192 మంది బాధపడుతున్నట్టు గుర్తించి, ట్రీట్మెంట్​ఇస్తున్నారు. పేషెంట్లను రెగ్యులర్​గా ఫాలోఅప్ చేస్తూ గైడ్​చేస్తున్నారు. వ్యాధి తీవ్రతగా ఎక్కువగా ఉన్నవారిని జిల్లా దవాఖానాలకు, హైదరాబాద్ లోని ఎంఎన్​జే ఆస్పత్రికి రెఫర్​చేస్తున్నారు. ఇక మహిళా క్లినిక్ లకు వచ్చేవారిలో ఎక్కువ మంది థైరాయిడ్, మెనోపాజ్, పీసీవోడీ వంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్లు ఉన్నారు. 2023 మార్చి నుంచి 2024 డిసెంబర్​వరకు మెనోపాజ్ సంబంధిత సమస్యలతో 3,43,660, పీసీవోడీ సమస్యలతో 1,64,957, విటమిన్ల​లోపంతో 5,09,775, యూరినరీ ఇన్​ఫెక్షన్లతో 84,500,  థైరాయిడ్​కు సంబంధించి 2, 25,100, లైంగిక వ్యాధులతో ​10,238 మంది మహిళా క్లినిక్ లలో ట్రీట్మెంట్​తీసుకున్నారు. 

ALSO READ : గుండె దడకు ఆర్ఎఫ్​సీఏతో చెక్..సమస్యను శాశ్వతంగా నివారించవచ్చు

మరిన్ని క్లినిక్ ల ఏర్పాటుపై కసరత్తు  

మహిళా క్లినిక్ లను 2023 మార్చిలో ప్రారంభించారు. మొదట్లో వీటికి ఆదరణ అంతంత మాత్రంగానే ఉండేది. వ్యాధులపై మహిళల్లో అవగాహన పెరుగుతుండటంతో క్రమేణా ఈ క్లినిక్ లకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. 2023 మార్చి నుంచి నవంబర్ వరకు 5.41 లక్షల మంది మహిళలకు ఆయా టెస్టులు నిర్వహించారు. 2024 మార్చి నుంచి నవంబర్ వరకు ఈ సంఖ్య 8.18 లక్షలకు చేరింది. ఒక్క డిసెంబర్ లోనే 90 వేల మంది మహిళలకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ముఖ్యంగా నోటి, రొమ్ము క్యాన్సర్​ సమస్యలు, పీసీవోడి సమస్యలతో ఎక్కువ మంది వస్తున్నారు. వారికి ఆయా వ్యాధులు, సమస్యల పట్ల డాక్టర్లు అవగాహన కల్పిస్తున్నారు. మహిళా క్లినిక్ లకు వచ్చేవారి సంఖ్య పెరుగుతుండటంతో మరిన్ని క్లినిక్ ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.