తియనాన్మెన్ స్క్వేర్ మార్పుకు ఊపిరి

కమ్యూనిజంపై చైనా విసుగెత్తిన దశలో చోటు చేసుకున్న విద్యార్థి ఉద్యమం క్లైమాక్సే తియనాన్మెన్‌‌‌‌ స్క్వేర్‌‌‌‌ ఘటన. స్టూడెంట్లతో పాటు, శ్రామికులు కూడా తియనాన్మెన్‌‌‌‌ స్క్వేర్‌‌‌‌లో గుమిగూడారు. ఆరువారాలపాటు స్వ్కేర్‌‌‌‌ని ముట్టడించారు. అప్పటి చైనా అధినాయకుడు డెంగ్‌‌‌‌ జియావోపింగ్‌‌‌‌ ‘ఇక చాలు’ అన్న ఒకే ఒక్క మాటతో సైన్యం స్క్వేర్‌‌‌‌లో దిగింది. యుద్ధ ట్యాంకులతో నిరసనకారులను చుట్టుముట్టింది. క్షణాల్లో ఖాళీ చేయించింది. ఈ సంఘటన జరిగి 30 ఏళ్లయింది. అయినా, తియనాన్మెన్‌‌‌‌ స్క్వేర్‌‌‌‌లో ఏం జరిగిందో.. ఎలా నిరసన ముగిసిందో… ఎంతమంది బలయ్యారో…ఇప్పటికీ ఇనుప తెరలోనే చిక్కుపడి ఉంది.

ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజంపై జనం తిరగబడుతున్న సమయంలో తియనాన్మెన్ స్వ్కేర్ సంఘటన చోటు చేసుకుంది. సోవియట్‌‌‌‌ రష్యాలో కమ్యూనిస్టు పార్టీ జనరల్‌‌‌‌ సెక్రటరీ,  దేశ అధ్యక్షుడు మిఖాయిల్‌‌‌‌ గోర్బచేవ్‌‌‌‌ ప్రవేశపెట్టిన ‘గ్లాస్‌‌‌‌నోస్త్‌‌‌‌ (పారదర్శకత)’, ‘పెరిస్త్రోయికా (పునర్నిర్మాణం)’ ప్రపంచంలో స్వేచ్ఛను కోరుకునేవారికి మంచి ఉత్సాహాన్నిచ్చాయి. ముఖ్యంగా కమ్యూనిస్టు దేశాల్లో అప్పటివరకు  మీడియాపైన, వాక్‌‌‌‌ స్వాతంత్య్రంపైన సెన్సారింగ్‌‌‌‌ ఉండేది  ఆయా దేశాల్లో సోషల్‌‌‌‌ లైఫ్‌‌‌‌పై  ఇనుప తెర ఉన్నట్టుగా భావించేవారు. గ్లాస్‌‌‌‌నోస్త్‌‌‌‌తో ఈ ఆంక్షలు తొలగించారు. పెరిస్ట్రోయికా ద్వారా  కోల్డ్‌‌‌‌ వార్‌‌‌‌ నుంచి సోవియట్‌‌‌‌కి విముక్తి కల్పించి పునర్నిర్మాణం చేయాలనుకున్నారు గోర్బచేవ్‌‌‌‌. దీనిని  ఇన్‌‌‌‌స్పిరేషన్‌‌‌‌గా తీసుకుని… చైనాలో విద్యార్థులు, ప్రజలు, కార్మికులు ప్రజాస్వామిక పాలన, ఆర్థిక సంస్కరణలు, స్వేచ్ఛకోరుతూ ఏకమయ్యారు. ఆరువారాలపాటు అప్పటి చైనా పాలకులకు వ్యతిరేకంగా తియనాన్మెన్‌‌‌‌లో గుమిగూడారు. శాంతియుతంగా జరుగుతున్న ఈ ప్రదర్శనను చైనా సైన్యం ఉక్కుపాదంతో తొక్కిపడేసింది. చైనా చరిత్రలో ఇదొక రక్తపు మరక. ఈ దారుణం జూన్ 4 న జరిగింది. సరిగ్గా 30 ఏళ్లు పూర్తయ్యాయి. చైనాలో ప్రజాస్వామ్యం కోసం గొంతెత్తిన  వేలాది మందిని ముఖ్యంగా స్టూడెంట్లను, కార్మికులను   కర్కశంగా అణచివేసిన రోజు అది.

రాజకీయాల్లో సంస్కరణల కోసం, పాలనలో ప్రజాస్వామ్యం కోసం తియనాన్మెన్ స్క్వేర్ దగ్గర పెద్ద ఎత్తున ప్రజలు నిరసన ప్రదర్శనలు చేశారు. పది లక్షల మందికి పైగా ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నట్లు సమాచారం. కమ్యూనిస్టు చైనా చరిత్రలో ఇదే అత్యంత  భారీ నిరసన. 1989 ఏప్రిల్ నెలలో ఈ నిరసన ప్రదర్శన ప్రారంభమైంది.. దీని ప్రభావం దేశంలోని మిగతా ప్రాంతాలపై కూడా పడింది. తియనాన్మెన్ స్క్వేర్ ప్రదర్శనలకు మద్దతుగా  చైనాలోని మిగతా నగరాలు, యూనివర్శిటీల్లో కూడా ర్యాలీలు జరిగాయి.  చైనా పాలకుల నియంతృత్వ పోకడలు నశించాలంటూ విద్యార్థి నాయకులు  పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఉక్కు సంకెళ్లకు వ్యతిరేకంగా, స్వేచ్ఛ కోసం తియనాన్మెన్ స్క్వేర్ దగ్గర ఆరు వారాల పాటు ఈ  నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. ఇది దేశమంతా పాకడంతో చైనా పాలకుల వెన్నులో వణుకు పుట్టింది.  విద్యార్థుల తిరుగుబాటును ఉక్కుపాదంతో అణచివేయాలని యాంగ్ షాంకున్ నాయకత్వంలోని చైనా ప్రభుత్వం డిసైడ్ అయింది. చడీ చప్పుడు లేకుండా జూన్ మూడో తేదీ రాత్రి తియనాన్మెన్ స్క్వేర్‌‌‌‌లోకి యుద్ధ ట్యాంకులు దిగాయి. పెద్ద ఎత్తున భద్రతాదళాలు వచ్చాయి. వచ్చీ రావడంతోనే కాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో స్టూడెంట్లతో సహా ఎంతోమంది ప్రజలు చనిపోయారు.  ప్రపంచ చరిత్రలో  ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చైనా విద్యార్థులు, కార్మికులు, సామాన్య ప్రజలు జరిపిన పోరాటంగా తియనాన్మెన్ స్క్వేర్ సంఘటన  నిలిచిపోయింది.  సంఘటన జరిగి 30 ఏళ్లయినా ఇప్పటివరకు అప్పటి కాల్పుల్లో ఎంత మంది చనిపోయారనే లెక్కలు లేవు.  చైనా ప్రభుత్వం ఇప్పటికీ ఒక  స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.  ప్రపంచ ఒత్తిడిని తట్టుకోలేక 1989 జూన్ చివరిలో మొక్కుబడిగా ఒక ప్రకటన విడుదల చేసింది. దానిలో  కేవలం 200 మంది పౌరులతో పాటు మరికొంతమంది భద్రతా సిబ్బంది చనిపోయారని చెప్పి, చేతులు దులుపుకుంది.

ఇంకా ఐరన్‌‌‌‌ కర్టెన్‌‌‌‌లోనే…

తియనాన్మెన్ స్క్వేర్ సంఘటనలో కనీసం పది వేల మంది చనిపోయి ఉంటారన్నది ఒక అంచనా.  బ్రిటన్ లేటెస్ట్ గా విడుదల చేసిన కొన్ని డాక్యుమెంట్లు ఈ విషయం వెల్లడించాయి. అంతకుముందు చనిపోయిన వారి సంఖ్య  ఒక వెయ్యి వరకు ఉండొచ్చని చాలా మంది అనుకున్నారు. చైనా స్టేట్ కౌన్సిల్ సభ్యుడు ఒకరికి బ్రిటన్ కు చెందిన ఒక ప్రముఖుడు పంపిన రహస్య పత్రాల్లో ఈ సమాచారం ఉంది.

30 ఏళ్ల నాటి ఈ తిరుగుబాటుపై మాట్లాడటానికి చైనాలో ఇప్పటికీ స్వేచ్చ లేదు. ఆనాటి సంఘటనపై  మాట్లాడటం, చర్చించడం, గుర్తు చేసుకోవడంపై ఇవాళ్టికి కూడా ఆంక్షలున్నాయి.  జూన్ 4వ తేదీ వస్తోందంటే  చైనా సోషల్ మీడియాలో అప్రకటిత సెన్సార్ షిప్ అమల్లో ఉంటుంది.  వేలాదిమంది పోస్టులను ఆసాంతం పరిశీలిస్తుంటారు. మృతుల సంస్మరణలను కూడా చైనా నిషేధించింది. రెచ్చగొట్టే కామెంట్స్ చేశారన్న సాకుతో గతంలో కొంతమందిని జైలుకు పంపిన సందర్భాలు చైనాలో ఉన్నాయి.  చైనా మెయిన్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌కి దూరంగా ఉండే హాంకాంగ్, తైవాన్‌‌‌‌లలో మాత్రం  తియనాన్మెన్  స్క్వేర్ సంఘటనను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. చనిపోయినవారిని గుర్తు చేసుకుంటూ కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. చైనా సైన్యం బుల్లెట్లకు బలైనవారి తల్లులు ఇప్పటికీ తమవారి జాడకోసం ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుంటూనే ఉన్నారు. స్వ్కేర్‌‌‌‌లో సైన్యం దాడుల అనంతరం చాలామంది తైవాన్‌‌‌‌, హాంకాంగ్‌‌‌‌లకు పోయి తలదాచుకున్నారు. వాళ్లంతా తమ అనుభవాలను చెబుతూ, చైనాలో జీ జిన్‌‌‌‌పింగ్‌‌‌‌ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తుంటారు.  అయినాగానీ, చైనా ప్రభుత్వం తియనాన్మెన్‌‌‌‌ స్క్వేర్‌‌‌‌ ఘటనను ‘విప్లవ ప్రతిఘాత చర్య (కౌంటర్‌‌‌‌ రివల్యూషన్‌‌‌‌)’గానే భావిస్తోంది.

 తియనాన్మెనే తెచ్చింది మార్పు 

తియనాన్మెన్ స్క్వేర్  సంఘటన జరిగిన తర్వాత చైనాలో సామాజికంగా అనేక మార్పులు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి.  మార్కెట్ ఎకానమీ  పెద్ద ఎత్తున విస్తరించింది. సొంత ఆస్తులు కూడబెట్టుకోవడానికి సర్కార్  పర్మిషన్ ఇచ్చింది. ఎంతమంది పిల్లలను కనాలనే దానిపై  ఉన్న ఆంక్షలను సడలించారు. ఇద్దరు పిల్లలను  కనడానికి  చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ జోరు తగ్గింది. కేవలం అసెంబ్లింగ్ మీదే చైనా ఆధారపడటం మొదలెట్టింది.  ఒక రకంగా ప్రజాస్వామ్యాన్నే తీసుకువచ్చింది. కమ్యూనిస్టు పార్టీ ఉనికి ఒక్కటే వెనకటి రోజులు గుర్తుచేస్తుంది.

ఇప్పటికీ స్వేచ్ఛ లేదు

ఏ ప్రజాస్వామ్యం కోసమైతే  తియనాన్మెన్ స్క్వేర్  దగ్గర వేలాది మంది కొన్ని వారాల పాటు నిరసన ప్రదర్శనలు చేసి చివరకు ప్రాణాలు అర్పించారో ఆ ప్రజాస్వామ్యం చైనాలో ఇప్పటికీ  అందని ద్రాక్షగానే మిగిలిపోయిందంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. పాలకులకు  వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా, ప్రజలను రెచ్చగొట్టేలా కామెంట్స్ చేసినా చైనా ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగుతుంది. కార్మికుల పోరాటానికి మద్దతు తెలియచేస్తూ  క్యూ జాంజువాంగ్ అనే పెకింగ్ యూనివర్శిటీ మాజీ స్టూడెంట్ లీడర్ పంపిన ఏడాది కిందట పంపిన వీడియో దుమారం రేపింది. ఈ వీడియో బయటకు వచ్చిన కొన్ని రోజుల్లోనే  క్యూ జాంజువాంగ్ సడన్ గా కనిపించకుండా పోయాడు. చైనాలో ఇలాంటి సంఘటనలు చాలా కామన్ అయిపోయాయి. కొంతమంది అరెస్టవుతారు. టైం బావుంటే జైలు నుంచి విడుదలై ఇళ్లకు చేరుకుంటారు. లేదంటే  సర్కార్ ప్రకటించే ‘ మిస్సింగ్ పర్సన్స్ లిస్ట్ ’ లో పేరు ఉంటుంది.

ఆనాటి పరిస్థితులతో పోలిస్తే  కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేవు. చాలా ఫ్యాక్టరీల్లో  కార్మికులకు జాబ్ సెక్యూరిటీ లేదు. తియనాన్మెన్ స్క్వేర్  ఆందోళనలో పాల్గొన్న కార్మికుడు హాన్ ను అప్పుడే పోలీసులు అరెస్టు చేశారు. రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించారు. తర్వాత చైనా నుంచి బహిష్కరించారు. హాన్ ప్రస్తుతం హాంగ్ కాంగ్ లో ఉంటున్నాడు. ఏ కార్మికుల హక్కుల కోసం అప్పట్లో పోరాటం చేశాడో అదే కార్మికుల కోసం ఇప్పటికీ  చైనా బయట ఉండి పోరు కొనసాగిస్తున్నాడు. చైనాలో కార్మికుల సమస్యలపై ఏకంగా ‘చైనా లేబర్ బులెటిన్ ’ ( సీఎల్ బీ ) పేరుతో ఓ మ్యాగజైనే నడుపుతున్నాడు. గతంతో పోలిస్తే  ప్రస్తుతం కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నాడు హాన్. ఇప్పటికీ చైనాలో  కార్మికులకు సమ్మె చేసే హక్కు లేదు. యూనియన్లు పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేదు.

996 వర్క్  కల్చర్

చైనాలో టెక్నికల్  కార్మికులకు సంబంధించి ‘996’ పేరుతో ఓ వర్క్ కల్చర్  తాజాగా తెరమీదకు వచ్చింది. ఈ వర్క్ కల్చర్‌‌‌‌లో కార్మికులు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మొత్తంగా 12 గంటలపాటు పని చేయాల్సి ఉంటుంది. వారానికి ఆరు రోజుల పని ఉంటుంది. ఈ వర్క్ కల్చర్‌‌‌‌కి వ్యతిరేకంగా  చైనా వ్యాప్తంగా  టెక్నికల్ సంస్థల్లో పనిచేసే కార్మికుల్లో నిరసన బాగా వెల్లువెత్తుతోంది .

ఇది ‘తిరుగుబాటే’ అంటున్న చైనా

వేలాదిమంది ఆందోళనకారులను పొట్టన పెట్టుకున్న తియనాన్మెన్  స్క్వేర్  సంఘటనను చైనా ప్రభుత్వం ఇప్పటికీ  సమర్థించుకుంటోంది.  ప్రజాస్వామ్యం కోసం ఉవ్వెత్తున ఎగసిన పోరాటాన్ని  ‘కౌంటర్ రివల్యూషన్ ’ గా పేర్కొంది. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికే కొంతమంది కావాలని తియనాన్మెన్ స్క్వేర్  దగ్గర గుమిగూడి ప్రజాస్వామ్యం ముసుగులో నిరసన ప్రదర్శనలను నిర్వహించారని  చైనా రక్షణ మంత్రి  వీ ఫెంగీ పేర్కొన్నారు. సింగపూర్ లో రెండేళ్ల కిందట జరిగిన ఓ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన చైనా మంత్రి  వీ ఫెంగీ, 30 ఏళ్ల కిందట చైనా సర్కార్ తీసుకున్న చర్యలను సమర్థించారు.

 

సాహసి ఈ ట్యాంక్ మాన్

తియనాన్మెన్ స్క్వేర్ సంఘటనలో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ‘ట్యాంక్​మాన్’ ఆకర్షించాడు. యుద్ధోన్మాదానికి, శాంతికి మధ్య నిలిచిన ఈ వ్యక్తిని తన లెన్స్‌‌లో బంధించినవాడు అసోసియేట్‌‌ ప్రెస్‌‌ ఫొటోగ్రాఫర్‌‌ జెఫ్‌‌ వైడ్నర్‌‌.  వరుసగా వస్తున్న యుద్ధ ట్యాంకులకు ఎదురొడ్డి నిలిచిన ఇతనెవరో ఎవరికీ తెలియదు. తియనాన్మెన్ స్క్వేర్‌‌లో ప్రజాస్వామ్యం కోసం జరిపిన పోరాటానికి ఈ గుర్తు తెలియని వ్యక్తి  ఓ నిలువెత్తు సంతకంలా నిలిచాడు. 1989 జూన్ 5న స్క్వేర్ దగ్గరకు వస్తున్న యుద్ధ ట్యాంకులకు అడ్డుగా వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకున్న ఈ  గుర్తు తెలియని వ్యక్తి నిలబడ్డాడు. ఇతడిని పట్టుకోవడానికి సైనికులు ప్రయత్నిస్తే  వారిని తప్పించుకుంటూ  కొన్ని క్షణాల్లో మాయమయ్యాడట. ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. సైనికులు చంపేసి ఉంటారని జనం అనుకోవడం మొదలెట్టారు.