
హైదరాబాద్, వెలుగు: సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మధ్య ఐపీఎల్ టికెట్ల వివాదం నడుస్తోంది. తమకు ఉచితంగా ఇచ్చే కాంప్లిమెంటరీ పాసుల సంఖ్య పెంచాలంటూ హెచ్‌సీఏ బెదిరిస్తోందని ఎస్‌ఆర్‌హెచ్ జనరల్ మేనేజర్ పేరిట వచ్చిన ఓ ఈ–మెయిల్ చర్చనీయాంశమైంది. హెచ్‌సీఏ తీరు మారకపోతే తాము మరో రాష్ట్రంలో ఆడుకుంటామని అందులో పేర్కొనగా.. అసలు ఎస్‌ఆర్‌హెచ్ నుంచి తమకు ఎలాంటి అధికారిక ఈ–మెయిల్ రాలేదని హెచ్‌సీఏ ఆదివారం ప్రకటన చేసింది.
ఉప్పల్ స్టేడియం సౌత్ స్టాండ్‌లోని ఎఫ్12–-ఎ కార్పొరేట్ బాక్సులో పాసుల కేటాయింపుపై ఈ నెల 27న లక్నోతో మ్యాచ్ సమయంలో వివాదం జరిగినట్టు తెలుస్తోంది. గతంలో మాదిరి ఆ బాక్సు కెపాసిటీ 50 సీట్లుగా పేర్కొంటూ అందుకు సంబంధించిన పాసులను హెచ్‌సీఏకు ఇస్తున్నట్టు ఎస్‌ఆర్‌హెచ్ చెబుతోంది. కానీ, ఆ బాక్స్ సామర్థ్యం 30 సీట్లు మాత్రమే కావడంతో మిగిలిన 20 టికెట్లను ఇతర కార్పొరేట్ బాక్సుల్లో అడ్జస్ట్ చేయాలని ఈ సీజన్‌కు ముందే ఫ్రాంచైజీకి దృష్టికి తీసుకెళ్లగా అందుకు ఒప్పుకుందని హెచ్‌సీఏ అంటోంది.
అయితే, గత రెండు మ్యాచ్‌లకు అదే బాక్సుకు 50 పాసులు కేటాయించడంతో ఒప్పందం ప్రకారం స్టేడియం కెపాసిటీలో పది శాతం టికెట్లలో (3900) తమకు 20 తక్కువ వస్తున్నాయని వాదిస్తోంది. ఈ విషయంపై గత మ్యాచ్ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాదనలు జరగ్గా.. చర్చించి పరిష్కరించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇదిలాఉంటే తాము బెదిరిస్తున్నామంటూ సన్ రైజర్స్ ఫ్రాంచైజీలోని కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే తమ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని హెచ్‌సీఏ పేర్కొంది.