ఖమ్మం, వెలుగు: జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్, సీపీఎం మధ్య టికెట్ ఫైట్ సాగుతూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది తామంటే తామని రెండు పార్టీల లీడర్లు చెప్పుకుంటున్నారు. పొత్తుల పరిస్థితిపై ఇంకా పూర్తిస్థాయిలో క్లారిటీ రాలేదు. అయినా ఆయా పార్టీల లీడర్లు చేస్తున్న కామెంట్లు మాత్రం గందరగోళానికి దారి తీస్తున్నాయి. రాష్ట్రంలోనే సీపీఎం కోరుకునే మొదటి ప్రాధాన్యం పాలేరేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఒకవైపు ప్రకటన చేస్తే, పాలేరు నుంచి బీఆర్ఎస్తరపున కందాల ఉపేందర్ రెడ్డి పోటీ చేయడం పక్కా అని మరోవైపు ఆ పార్టీ లీడర్లు కుండబద్దలు కొడుతున్నారు. ‘కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని’ ఇటీవల ఎమ్మెల్యే కందాల కామెంట్స్చేశారు. ఆ వెంటనే సీపీఎం, సీపీఐ తరపున కౌంటర్లు వదలారు. గతంలో కమ్యూనిస్టుల ఓట్లతోనే ఆయన గెలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తాజాగా బీఆర్ఎస్జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి పొత్తులపై చర్చకు దారి తీశాయి. ‘ఉపేందర్‌రెడ్డికి సీఎం కేసీఆర్ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని.. వచ్చే ఎన్నికల్లో పోటీలో ఆయనే నిలబడతారు, గెలుస్తారు’.. అని అన్నారు.
నాలుగేళ్లుగా పార్టీలోనే కుంపట్లు..!
అధికార బీఆర్ఎస్ లో పాలేరు నియోజకవర్గంలో నాలుగేళ్లుగా వర్గపోరు కొనసాగుతోంది. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై కాంగ్రెస్ తరపున గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. కొద్ది నెలల్లోనే ఆయన టీఆర్ఎస్ లో చేరారు. దీంతో వర్గపోరు మొదలైంది. మాజీ మంత్రి వర్సెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్న పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు లీడర్లు వచ్చే ఎన్నికల్లో బీఫామ్ తనదంటే తనదేనని ధీమాగా ఉన్నారు. ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికలలో బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐల మధ్య కుదిరిన పొత్తులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతాయనే సంకేతాన్ని మూడు పార్టీల లీడర్లు ఇస్తున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ఖమ్మం జిల్లాకు వచ్చిన సమయంలో, బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించిన సమయంలోనూ కమ్యూనిస్టు పార్టీల నేతలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. సీపీఎం ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో పాలేరు, మధిర, భద్రాచలం సీట్లను అడుగుతుండగా, సీపీఐ కొత్తగూడెం, వైరా, ఇల్లందు స్థానాలపై గురి పెట్టినట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానాలపై ఫోకస్ పెట్టడంతో సమస్య ఎదురవుతోంది. ఇప్పటికే పాలేరు బెర్త్ కోసం తుమ్మల, కందాల పోటీ పడుతుండగా, తాజాగా తమ్మినేని కూడా ఈ రేసులో చేరారు.
క్లారిటీ లేకున్నా కత్తులు దూస్తున్నరు..!
బీఆర్ఎస్, కమ్యూనిస్టుల మధ్య పొత్తులు దాదాపు కన్ఫామ్ అయినా, ఏయే స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. దీంతో పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని చెప్పుకునేందుకు నేతలు ప్రయత్నించడం పోటీ చేయాలనుకుంటున్న వారికి ఇబ్బందికరంగా మారుతోంది. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలంలో ఇప్పటికే సీపీఐ, బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలున్నాయి. రెండు పార్టీల లీడర్లు ఒకరిపై ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి, వ్యక్తిగత అంశాలపై తిట్టుకునే వరకు వెళ్లింది. దీంతో పోలీస్ కేసులు కూడా అయ్యాయి. ఇక సీపీఎం, బీఆర్ఎస్ మధ్య ఇంతకు ముందు పెద్దగా విభేదాలు లేకున్నా, తాజాగా తమ్మినేని పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడం, పొత్తులపై అధికారికంగా స్థానాలు ఖరారు కాకున్నా తాము బరిలో ఉంటామని తమ్మినేని ప్రకటించడంపై కందాల ఉపేందర్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలకు బలం ఉందని, వాటితో పొత్తుల ద్వారా తాము ఎన్నికల్లో ముందుకు పోతామని ఒకవైపు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటిస్తుండగా, దీనికి వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కామెంట్లు చేయడం కామ్రెడ్ల ఆగ్రహానికి కారణమైంది. మరోవైపు చాపకింద నీరులా వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాలేరు నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కందాల వర్సెస్ కమ్యూనిస్టులు.. .
మొన్నటి వరకు అధికార బీఆర్ఎస్ లో నేతల మధ్య వచ్చే ఎన్నికల టికెట్ కోసం పోటీ ఉండేది. రీసెంట్ గా తమ్మినేని వీరభద్రం చేసిన కామెంట్స్‌తో బీఆర్ఎస్వర్సెస్ కమ్యూనిస్టులు అన్నట్లు మారింది. ఇటీవల జన చైతన్య యాత్రలో పాలేరు నియోజకవర్గంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పర్యటించారు. ఒకే స్టేజీపై నుంచి పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని బావ అంటూ పిలుస్తూనే, పాలేరు నియోజకవర్గంలో తమ పార్టీ తప్పక పోటీ చేస్తుందని తమ్మినేని మాట్లాడారు. దీనిపై వెంటనే కౌంటర్ వేయని సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల, మరుసటి రోజు రియాక్ట్ అయ్యారు. కమ్యూనిస్టులకు జనం ఓట్లు వేసే రోజులు పోయాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు కమ్యూనిస్టు పార్టీల లీడర్లకు ఆగ్రహాన్ని తెప్పించాయి. వెంటనే సీపీఎం, సీపీఐ నేతలు ఎటాక్ అయ్యారు. కమ్యూనిస్టుల సపోర్ట్ తోనే గత ఎన్నికల్లో కందాల గెలిచిన విషయాన్ని మర్చిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌చేశారు.