కాంగ్రెస్‍లో కొత్త, పాత పంచాయితీ .. ఎమ్మెల్యే టికెట్ల కోసం పోటాపోటీగా ప్రయత్నాలు

  • తూర్పులో కొండా, ఎర్రబెల్లి దంపతుల మధ్య ఫైట్‌‌
  • పశ్చిమలో రాజేందర్‌‌రెడ్డి వర్సెస్‌‌ రాఘవరెడ్డి
  • వర్ధన్నపేట, పరకాల టికెట్ల విషయంలోనూ జోరుగా పైరవీలు

వరంగల్‍, వెలుగు : గ్రేటర్‌‌ వరంగల్‌‌ మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ పరిధిలోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌‌ లీడర్ల మధ్య టికెట్ల పంచాయితీ నడుస్తోంది. గ్రేటర్‌‌ పరిధిలో ప్రధానంగా వరంగల్‌‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని కొన్ని డివిజన్లు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పాత, కొత్త లీడర్ల మధ్య వార్‌‌ మొదలైంది. అసెంబ్లీ టికెట్ల కోసం ఇప్పటికే అప్లికేషన్లు ఇచ్చిన లీడర్లు టికెట్‌‌ తమదేనంటే తమదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 

తూర్పులో కొండా వర్సెస్‌‌ ఎర్రబెల్లి కపుల్స్‌‌

వరంగల్‍ తూర్పులో సీనియర్లైన కొండా సురేఖ మురళి, ఎర్రబెల్లి స్వర్ణ వరద రాజేశ్వర్‌‌రావు దంపతుల మధ్య సైలెంట్‌‌ వార్‌‌ నడుస్తోంది. సురేఖ గతంలో మంత్రిగా పనిచేయగా, స్వర్ణ గ్రేటర్‌‌ మేయర్‌‌గా పనిచేశారు. ఈ నియోజకవర్గంలో తమకు బలమైన కేడర్‌‌ ఉందని, వచ్చే ఎన్నికల్లోనూ తామే బరిలో ఉంటామని, ఈ విషయాన్ని ఆరేడు నెలల కిందే హైకమాండ్‌‌కు స్పష్టంగా తెలిపామని కొండా దంపతులు చెబుతున్నారు. మరో వైపు ప్రస్తుతం జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న స్వర్ణ తనకే టికెట్‌‌ కేటాయించాలని కోరుతున్నారు. తాము ఇష్టారీతిన పార్టీలు మారలేదని, కష్టకాలంలో కేడర్‍ను కాపాడుకుంటూ వచ్చామని అంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్య గ్రూప్‌‌ పాలిటిక్స్‌‌ నడుస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలు సైతం వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. 

పచ్చిమలో రెడ్ల వార్‌‌

నాయిని రాజేందర్‍రెడ్డి గతంలో ఉమ్మడి జిల్లా, ఇప్పుడు హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. యువజన కాంగ్రెస్‌‌ మొదలు ఇప్పటివరకు వివిధ హోదాలో సేవలందించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్‌‌ ఆశించినా పొత్తుల కారణంగా భంగపాటు తప్పలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా టిక్కెట్‌‌ తనకే దక్కుతుందన్న ఉద్దేశంతో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. అయితే నాయినికి జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పోటీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్‍రావుపై పోటీకి దిగిన రాఘవరెడ్డి ఇప్పుడు పశ్చిమ టికెట్‌‌ కోసం ప్రయత్నిస్తున్నారు. కాజీపేటలో తనకు పూర్తి పట్టుందని, సిటీలోనూ కేడర్‌‌ సైతం తనకు సహకరిస్తారని చెబుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గ టికెట్‌‌ కోసం ఎవరికివారుగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. 

వర్ధన్నపేటలో కొత్తొళ్లదే హవా

ఎస్సీ నియోజకవర్గమైన వర్ధన్నపేట ఒకప్పుడు కాంగ్రెస్‌‌ పార్టీకి కంచుకోట. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‍ బీజేపీలో చేరడంతో నమిండ్ల శ్రీనివాస్‌‌ నియోజకవర్గ ఇన్‌‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ సారి తానే బరిలో ఉంటానన్న ధీమాతో ఉన్నారు. అయితే మాజీ పోలీస్‌‌ కమిషనర్‌‌ కేఆర్‌‌.నాగరాజు రెండు నెలల క్రితం కాంగ్రెస్‌‌లో చేరారు. తాను వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటానని ప్రచారం చేస్తున్నారు. బట్టి విక్రమార్కవంటి పెద్దల సపోర్ట్‌‌ ఉందని,

టికెట్‌‌ తనకే దక్కుతుందని నమ్మకంగా చెబుతున్నారు. దీంతో నాగరాజు, నమిండ్ల శ్రీనివాస్‌‌ రెండు గ్రూపులుగా విడిపోయారు. మరో వైపు ఒయాసిస్‌‌ విద్యాసంస్థల చైర్మన్‌‌ పరంజ్యోతి సైతం తెరమీదకు వచ్చారు. దీంతో ఇద్దరి మధ్య పోటీ కాస్తా ముగ్గురికి చేరుకుంది. దీంతో ఎవరికి టికెట్‌‌ ఇస్తే లీడర్లు, కేడర్‌‌ సహకరిస్తారన్న వివరాలను హైకమాండ్‌‌ సేకరిస్తున్నట్లు సమాచారం.  

పరకాల నాదే అంటున్న కొండా, ఇనుగాల

పరకాల నియోజకవర్గం సీటు విషయంలో కొండా మురళితో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసిన ఇనుగాల వెంకట్రామిరెడ్డి మధ్య పోటీ నడుస్తోంది. పరకాల నియోజకవర్గంలో తమకు బలమైన కేడర్‌‌ ఉందని మురళి వర్గం వాదిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన వెంకట్రామిరెడ్డి అధికార పార్టీకి కనీస పోటీ ఇవ్వలేకపోయారని పెద్దలకు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే కొండా దంపతులు పార్టీ మారాక కేడర్‌‌ను కాపాడుకున్నామని ఇనుగాల టీం వాదిస్తోంది. కొండా సురేఖ సైతం గతంలో ఓడిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో మురళికి టిక్కెట్‍ ఇస్తారా ? లేక ఇనుగాలను కంటిన్యూ చేస్తారా అన్ని విషయంపై నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తోంది.