- బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో రచ్చకెక్కుతున్న అసంతృప్తులు
- చిట్టెం హటావో.. మక్తల్ బచావో’ పేరుతో హైదరాబాద్‌లో రూలింగ్ పార్టీ లీడర్ల మీటింగ్
- తమకు టికెట్ రాకుంటే సపోర్ట్ చేసేది లేదని బహిరంగ ప్రకటనలు
మహబూబ్‌నగర్, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో టికెట్ల పంచాయితీలు ముదురుతున్నాయి. నిన్న, మొన్నటి వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఒకటి, రెండు నియోజకవర్గాలకే పరిమితమైన అసమ్మతి, తాజాగా మిగిలిన నియోజకవర్గాల్లోనూ కనిపిస్తోంది. రూలింగ్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వారికి టికెట్లు క్యాన్సిల్ చేయాలని అదే పార్టీకి చెందిన లీడర్లు బహిరంగంగా డిమాండ్ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీలోనూ కొత్త,-పాత లీడర్ల మధ్య సమస్య సద్దుమణిగినట్లే అనిపించినా మళ్లీ మొదటికొచ్చింది.
తెరమీదికి మక్తల్ ఇష్యూ..
అసెంబ్లీ ఎలక్షన్లకు మూడు నెలల టైం ఉండగానే సీఎం కేసీఆర్ ఆగస్టు 21న ఆ పార్టీ క్యాండిడేట్లను ప్రకటించారు. 115 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను ప్రకటించగా, కొన్ని చోట్ల మినహా సిట్టింగులకే మళ్లీ చాన్స్ ఇచ్చారు. ఇందులో చాలా మంది సిట్టింగుల పనితీరు బాగాలేదని, వారికి కాకుండా ఇతరులను టికెట్లు ఇవ్వాలని కొద్ది రోజులుగా అదే పార్టీకి చెందిన లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలంపూర్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు కాకుండా ఇతరులకు ఇవ్వాలని ఆ పార్టీకి చెందిన అయిజ, ఇటిక్యాల, మానవపాడు, వడ్డేపల్లి మండలాలకు చెందిన లీడర్లు వారం రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఆయనకు సపోర్ట్ చేసేది లేదంటూ సమావేశాలు పెట్టి మరీఆ ప్రకటిస్తున్నారు.
కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, గువ్వల బాలరాజు అభ్యర్థిత్వాలపై కొందరు అసంతృప్తిగా ఉన్నా, బయట పడడం లేదు. తాజాగా ‘చిట్టెం హటవో.. మక్తల్ బచావో’ నినాదంతో అదే పార్టీకి చెందిన మక్తల్ నియోజకవర్గానికి చెందిన లీడర్లు నిరసనకు దిగారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ఫాంహౌజ్‌లో మాజీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ దేవరి మల్లప్ప, వీజేఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథరెడ్డి, బీకేఎస్ ఫౌండేషన్ అధినేత గవినోళ్ల బాలకిష్టారెడ్డి, మాజీ ఎంపీపీలు, పీఏసీఎస్ చైర్మెన్లు, సర్పంచులు, సీనియర్ లీడర్లు సమావేశం అయ్యారు. మక్తల్ టికెట్‌ను ఇతరులకు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును కలవనున్నట్లు సమాచారం. ఒక వేళ హైకమాండ్ తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే చిట్టెం రాంమోహన్‌రెడ్డి కోసం ఎవరూ పని చేయవద్దని మీటింగ్‌లో తీర్మానించినట్లు తెలిసింది.
కాంగ్రెస్‌లో తీవ్రమైన పోటీ..
కాంగ్రెస్ పార్టీలోనూ పాత, -కొత్త లీడర్లతో పాటు ఆశావహుల మధ్య టికెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఇటీవల ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిత్వాల కోసం ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదారుగురు అప్లై చేసుకున్నారు. అయితే, పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్న వారికే టికెట్లు ఇవ్వాలని కొందరు లీడర్లు పట్టుబడుతున్నారు. ఇటీవల పార్టీలో చేరిన వారికి టికెట్లు కేటాయించ వద్దని రాష్ట్ర లీడర్లకు కంప్లైంట్లు చేస్తున్నారు. సీనియర్లు మాత్రం ఎవరేం ప్రయత్నాలు చేసినా, చివరగా పోటీలో ఉండేది తామే అంటూ ప్రకటించుకుంటున్నారు. ఇటీవల గద్వాల అసెంబ్లీ టికెట్‌ను పార్టీ కోసం పని చేస్తున్న వారికి ఇవ్వాలని, ఇతర పార్టీల నుంచి వచ్చిన కోవర్టులకు కేటాయించ వద్దని సీఎల్పీ లీడర్ మల్లు భట్టివిక్రమార్కకు ఆ పార్టీ లీడర్లు వినతిపత్రం ఇచ్చారు. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నుంచి తానే పోటీలో ఉంటానని ఇటీవల సమావేశం నిర్వహించి ప్రకటించారు.
ఇదే స్థానం నుంచి కూచుకుళ్ల రాజేశ్ కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డి ఇటీవల రేవంత్‌రెడ్డిని కలువడంతో.. దేవరకద్ర, మక్తల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీ అభ్యర్థిత్వాల కోసం అప్లై చేసుకున్న పాలమూరు, నారాయణపేట డీసీసీ అధ్యక్షులు జి.మధుసుదన్‌రెడ్డి, వాటికి శ్రీహరితో పాటు కాటం ప్రదీప్‌కుమార్ గౌడ్, కొండా ప్రశాంత్‌రెడ్డి, ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, నాగరాజు గౌడ్, పోలీస్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు టెన్షన్లో ఉన్నారు. కొల్లాపూర్ టికెట్ కోసం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జగదీశ్వర్ రావు మధ్య పొటీ నడుస్తోంది. జగదీశ్వర్‌రావు టికెట్ తనకే వస్తుందని, కేడర్ తనకే సపోర్ట్ చేయాలని ఇటీవల సమావేశాలు కూడా నిర్వహించారు. వనపర్తిలో ప్రధానంగా మాజీ మంత్రి చిన్నారెడ్డి, శివసేనారెడ్డి మధ్య టికెట్ కోసం ఫైట్ నడుస్తోంది.
రాజీపై దృష్టి పెట్టట్లే..
రెండు రోజుల కింద కల్వకుర్తికి చెందిన బీఆర్ఎస్ అసమ్మతి నేతలతో మంత్రులు హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఒక్క చోట మినహా.. రెండు పార్టీల్లో అసంతృప్తులు సమావేశాలు పెట్టి రచ్చకెక్కుతున్నా రాజీ కుదిర్చేందుకు హైకమాండ్ రంగంలోకి దిగడం లేదు. రెండు పార్టీలు వేచి చూసే ధోరణిని అవలంబిస్తూనే, అసంతృప్తులపై ఒక కన్నేసి ఉంచినట్లు చెబుతున్నారు.