
మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల సంకేతాలతో రాజకీయ నాయకులు అలర్ట్ అవుతున్నారు. ఇప్పటినుంచే ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు వివిధ కార్యక్రమాల పేరుతో జనంలోకి వెళ్తున్నారు. ఇదే క్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ఆయన కొడుకు విజిత్‌రావు నెలరోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నిత్యం జనం మధ్యలో ఉండేందుకు నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఆలయ దర్శనాలు, చావులు, పరామర్శలు ఇలా ఏ కార్యం ఉన్నా అక్కడ తండ్రీకొడుకులు ప్రత్యక్షమవుతున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై టీఆర్ఎస్ పార్టీ జరిపించిన సర్వేలో దివాకర్‌రావుకు నెగటివ్ రిపోర్టు రావడమే దీనికి కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పనితీరు బాగాలేక పడిపోయిన గ్రాఫ్...
ఎమ్మెల్యే దివాకర్‌రావుకు వ్యక్తిగతంగా మంచిపేరు ఉన్నప్పటికీ ఆయన పనితీరుపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ సర్కారుపై ఉన్న వ్యతిరేకత కూడా తోడు కావడంతో ప్రజల్లో ఆయన గ్రాఫ్ బాగా పడిపోయినట్టు విశ్లేషిస్తున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ ప్రజలు ఆశించిన స్థాయిలో ఆయన పనితీరు లేదన్నది ప్రధాన విమర్శ. ఎల్లంపల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు పదిహేనేండ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. తలాపున గోదావరి ఉన్నా నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవల వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు, ముంపు బాధితులకు పరిహారం ఇప్పించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. మంచిర్యాల, నస్పూర్, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టడమే తప్ప పనులు జరగడం లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఇచ్చిన పలు హామీలను నెరవేర్చకపోవడంతో కార్మిక వర్గంలో అసంతృప్తి ఉంది. అలాగే 2018 ఫిబ్రవరిలో శ్రీరాంపూర్ స్టేడియంలో జరిగిన సింగరేణీయుల ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఐదేండ్లు కావస్తున్నా అమలు కాలేదు. గోదావరి నదిపై మంచిర్యాల – అంతర్గాం బ్రిడ్జి నిర్మాణానికి బ్రేకులు పడుతూ ఇటీవలే రూ.165 కోట్లతో టెండర్లు పూర్తయినప్పటికీ పనులు మొదలు కాలేదు. మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి కోటేశ్వ ర్ రావు పల్లి జంక్షన్ వరకు ఫోర్‌లేన్, లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి రాజీవ్‌నగర్ వరకు ఆర్వోబీ, 100 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులకు నేటికీ మోక్షం కలగలేదు. గోదావరిలో లక్సెట్టిపేట – కోటిలింగాల మధ్య బోటింగ్, టూరిజం డెవలప్మెంట్ ఇటీవల ఒక్క బోట్ ప్రారంభంతోనే ఆగిపోయింది. గోదావరి ఒడ్డున రూ.18 కోట్లతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్) జూలైలో వరదలతో నీటమునిగి నిరుపయోగంగా మారడం, మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు, శ్మశానవాటికలు నిర్మించకపోవడం, మెడికల్ కాలేజీకి మరో చోట స్థలం ఖరారు చేయకపోవడం తదితర అంశాల్లో ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాగే మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీల్లో రూలింగ్ పార్టీ లీడర్లు భూదందాలు, ఆఖరికి ఆసరా పింఛన్లు, రైతుబీమాలో అవినీతి వ్యవహారాలతో ఎమ్మెల్యేకు చెడ్డపేరు తీసుకొచ్చారు.
గ్రాఫ్ పెంచుకునేందుకు తంటాలు...
పడిపోయిన గ్రాఫ్‌ను పెంచుకునేందుకు ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఆయన కొడుకు విజిత్‌రావు నానా పాట్లు పడుతున్నారు. తండ్రీకొడుకులు నెలరోజులుగా జనంలో తిరుగుతున్నారు. దివాకర్‌రావు ఇటీవల గ్రామాలు, మున్సిపాలిటీల్లో తిరిగి కొత్త పింఛన్ కార్డులను లబ్దిదారులకు స్వయంగా అందజేశారు. తర్వాత వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభం పేరుతో పల్లెలన్నీ చుట్టేశారు. మంచిర్యాల, లక్సెట్టిపేట, నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో వార్డు పర్యటనలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ తనకు టికెట్ రాకుంటే కొడుకు విజిత్‌రావును బరిలోకి దించాలని ఆరాటపడుతున్నారు. చాలాకాలంగా షాడో ఎమ్మెల్యేగా వ్యవహారాలు నడిపిస్తున్న విజిత్‌రావు సైతం అవకాశం వస్తే అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన 'ఇంటింటికి పాదయాత్ర' పేరుతో నియోజకవర్గంలో ఇల్లిల్లూ తిరుగుతూ హడావుడి చేస్తున్నారు. గత ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కిన దివాకర్‌రావుకు ఈసారి అధిష్టానం టికెట్ ఇస్తుందా? విజిత్‌రావును బరిలో నిలుపుతుందా? లేక బీసీ నినాదంతో కొత్త క్యాండిడేట్ను తెరమీదికి తీసుకొస్తుందా? అన్న చర్చ జరుగుతోంది.