- జడ్చర్లలో ప్రధాన పార్టీల నుంచి టికెట్ల కోసం ఇద్దరు చొప్పున పోటీ
- టికెట్ తమకే వస్తుందంటూ ధీమా
- పబ్లిక్ దగ్గరయ్యేందుకు యాత్రలకు ప్లాన్
మహబూబ్‌నగర్, వెలుగు : ఎన్నికల వేళ రూలింగ్, అపోజిషన్ పార్టీల లీడర్ల మధ్య టికెట్ల లొల్లి నడుస్తోంది. ఈసారి పోటీలో ఉండేది మా లీడరే అంటూ ఓ వర్గం వారు.. కాదు కాదు.. మా సార్కే టికెట్ కన్ఫాం అయిందంటూ మరో వర్గం నేతలు ప్రచారం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రస్తుతం రాజకీయంస్తబ్దుగా ఉంది. జడ్చర్ల నియోజకవర్గంలో మాత్రం హాట్‌హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి. జడ్చర్ల బీఆర్ఎస్ టికెట్ విషయంలో మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, టీటీడీ బోర్డ్ మెంబర్ మన్నె జీవన్‌రెడ్డి మధ్య పోటీ నడుస్తున్నట్లు పబ్లిక్ చర్చించుకుంటోంది. హైకమాండ్ కూడా జీవన్‌రెడ్డికి కమిట్మెంట్ ఇచ్చినట్లు ఆయన వర్గం చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గ్రౌండ్ లెవల్లో కార్యకర్తలు, ప్రజలతో అటాచ్మెంట్ లేకపోవడంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తునట్లు తెలిసింది. వచ్చే వారం నుంచి పబ్లిక్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది.
ఇప్పటికే మండల, గ్రామ స్థాయి లీడర్లను కలిసేందుకు ప్రత్యేకంగా వారితో ఇతర ప్రాంతాల్లో సమావేశం అవుతున్నట్లు సమాచారం. త్వరలో సీఎం కేసీఆర్ ప్రకటించే ఫస్ట్ లిస్ట్‌లో కూడా జీవన్‌రెడ్డి పేరు ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఎంఎస్ఎన్ డైరెక్టర్ పదవిని కూడా జీవన్‌రెడ్డి వద్దనుకున్నట్లు సమాచారం. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో సన్నిహిత సంబంధాలున్నాయి. జడ్చర్ల అసెంబ్లీ టికెట్‌ను ఆయన్ను కాదని జీవన్‌రెడ్డికి ఇవ్వడం సాధ్యపడుతుందా? అనే చర్చ కూడా నడుస్తోంది. ఒకవేళ హైకమాండ్ జీవన్‌రెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇస్తే, లక్ష్మారెడ్డికి మహబూబ్‌నగర్ పార్లమెంట్ టికెట్ ఇచ్చి బుజ్జగిస్తుందా? అనే విషయంపై పబ్లిక్ చర్చించుకుంటోంది.
బీజేపీలోనూ అంతే..
బీజేపీ నుంచి ఆర్.బాలా త్రిపురసుందరి టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రజలను కలుస్తూ, పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీంల గురించి వివరిస్తున్నారు. రూలింగ్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పబ్లిక్కు అవగాహన కల్పిస్తున్నారు. కానీ, జిల్లా స్థాయి కేడర్ ఈమెకు సహకారం అందించడం లేదు. పదవి లేకుండా నియోజకవర్గంలో ఎలా తిరుగుతారు? అంటూ అడ్డుకుంటున్నారు. ఇటీవల బీజేపీ హైకమాండ్ ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలో ఈమె పేరు ఉన్నా, ఓ లీడర్ సైలెంట్‌గా పేరును డిలీట్ చేయించారనే టాక్ పాలమూరులో చక్కర్లు కొడుతోంది. దీనికితోడు ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ పోటీ చేస్తారని ఆ పార్టీకి చెందిన జిల్లా స్థాయి లీడర్లు ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్‌లో హోరాహోరీ..
ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పోటీ పడుతున్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్ జోడోయాత్ర’, ఇటీవల సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్‌మార్చ్’ నియోజకవర్గంలో విజయవంతానికి అనిరుధ్ కృషి చేశారు. దీంతో ఆయనపై హైకమాండ్ సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. హస్తిన నుంచి కూడా టికెట్ కన్ఫాం చేసినట్లు ఆయన వర్గం లీడర్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అనిరుధ్ ప్రజలకు దగ్గరయ్యేందుకు నెల రోజులుగా ‘ప్రజాహిత పాదయాత్ర’ పేరుతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఈ పాదయాత్రకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి కూడా సపోర్ట్ చేసి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇదే స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ ఈక్వేషన్స్ ఆధారంగా టికెట్ తనకే వస్తుందనే ధీమాలో ఉన్నారు. త్వరలో ‘రైతు భరోసాయాత్ర’కు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇందు కోసం ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.