- అర్బన్ కోసం మహేశ్ పట్టు..
- హైకమాండ్‌పై ధీమాతో సంజయ్
- రూరల్‌లో భూపతిరెడ్ది..నగేశ్ రెడ్డి పంతం
- కొత్తగా వచ్చిన వారిపై అర్మూర్లో వ్యతిరేకత
- ఎటూ తేల్చలేక హైకమాండ్ అయోమయం
- ఫిరాయింపులపై టెన్షన్
నిజామాబాద్, వెలుగు: జిల్లా కాంగ్రెస్‌లో అసెంబ్లీ టికెట్ల పంచాయితీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయో తెలుసుకొని రేస్‌లోని ఇతర లీడర్లు పైరవీలు షురూ చేశారు. అర్బన్, రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఆశావహులు ఎవరూ తగ్గడం లేదు. దీంతో ఫైనల్ నిర్ణయం తరువాత ఫిరాయింపుల భయం లీడర్లను కలవరపెడుతోంది. తొందర్లోనే టికెట్లను ప్రకటించే అవశాశం ఉండడంతో ఆశావహులు ఢిల్లీలో మకాం వేసి పైరవీలు చేస్తున్నారు.
అర్బన్‌లో ఇద్దరి పేర్ల పరిశీలన
నిజామాబాద్ అర్బన్ టికెట్ కోసం 12 మంది అప్లై చేసుకున్నారు. వడపోతల తరువాత మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో మేయర్‌గా పనిచేసిన అనుభవం, సామాజిక, ఆర్థిక అంశాల ప్రతిపాదికన సంజయ్పేరును పరిశీలిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న మహేశ్‌ను ఎలా కాదనే పరిస్థితి ఉండకవపోవచ్చని భావిస్తున్నారు. తండ్రి డి.శ్రీనివాస్ ఢిల్లీ పరిచయాలను సంజయ్ తన టికెట్ కోసం ఉపయోగించుకుంటూ ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌ను ఆశ్రయించారు. మహేశ్‌గౌడ్ కూడా హస్తిన లాబీయింగ్ నడుపుతూ చివరగా రాహుల్‌గాంధీని కలిసే యోచనలో ఉన్నారు.
ఆర్మూర్ లో అంతే...
ఆర్మూర్ నుంచి పది మంది పోటీకి సై అంటున్నారు. 2018 ఎలక్షన్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన వినయ్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. టికెట్ గ్యారంటీ ఇవ్వడం వల్లే ఆయన కాంగ్రెస్‌లో చేరినట్టు ప్రచారముంది. పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో బీసీ నేతలకు అర్బన్, ఆర్మూర్లలో మాత్రమే టికెట్ ఇవ్వగలిగే వెసులుబాటు ఉంది. ఆ లెక్కన గోర్త రాజేందర్ టికెట్ కోరుతూ ప్రచారం కూడా మొదలుపెట్టారు. బోధన్, బాల్కొండ నియోజకవర్గాలలో ఎవరికివ్వాలనే అంశంపై హైకమాండ్ పూర్తి క్లారిటీతో ఉన్నా రేసులోని ఇతర లీడర్ల గురించి టెన్షన్ పడుతోంది. ఉద్దండ నేతలు ఆశావహులుగా ఉన్నా గెలిచే వారినే నిలబెట్టాలని పార్టీ నిర్ణయించింది. జంప్‌లపై ఆందోళనతో బీజేపీ అభ్యర్థుల లిస్టు వచ్చేదాకా ఎదురుచూడాలని అధిష్టానం యోచిస్తున్నట్టు సమాచారం.