టిక్‌‌టాక్ యూజర్లు  లోకల్ యాప్‌ల వైపు

టిక్‌‌టాక్ యూజర్లు  లోకల్ యాప్‌ల వైపు

పెరుగుతున్న ఎంఎక్స్‌‌ టకాటక్‌‌, జోష్‌‌, మోజ్‌‌, రొపొస్సో యూజర్లు
రెవెన్యూ సంపాదించేందుకు కొత్త మార్గాలు..
టిక్‌‌టాక్ బ్యాన్‌‌కి ఏడాది.. షార్ట్‌‌ వీడియో మార్కెట్‌‌లో మారుతున్న పరిస్థితులు

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: దేశంలో టిక్‌‌టాక్ బ్యాన్ అయ్యి ఏడాది పూర్తవుతోంది. ఈ యాప్ బ్యాన్ తర్వాత  ఇండియన్ యాప్‌‌లు చాలా వచ్చాయి. ఎంఎక్స్‌‌ టకాటక్‌‌, జోష్‌‌, మోజ్‌‌, రొపొస్సో, మిత్రో, చింగారీ వంటి లోకల్ యాప్‌‌లు యూజర్ల ముందుకు వచ్చాయి. ఇంటర్నేషనల్ కంపెనీలయిన ఇన్‌‌స్టాగ్రామ్‌‌ రీల్స్‌‌ను, యూట్యూబ్‌‌  షార్ట్స్‌‌ను తీసుకొచ్చాయి.  టిక్‌‌టాక్ బ్యాన్ కాకముందు  దేశంలో షార్ట్‌‌ కంటెంట్ వీడియో యూజర్ల సంఖ్య 210 మిలియన్ల అని  పీజీఏ  ల్యాబ్స్‌‌ అంచనా వేస్తోంది. ఇందులో కూడా టిక్‌‌ టాక్‌‌ను వాడేవారే 80–90 శాతం మంది వరకు ఉండేవారని పేర్కొంది. బ్యాన్‌‌ తర్వాత మంత్లీ యాక్టివ్ యూజర్లు భారీగా తగ్గిపోయారు. కానీ,  ఈ ఏడాది మార్చి నాటికి తిరిగి మంత్లీ యాక్టివ్ యూజర్లసంఖ్య 205 మిలియన్లను చేరుకుందని పీజీఏ పేర్కొంది.   టిక్‌‌టాక్ బ్యాన్ తర్వాత ఇతర షార్ట్‌‌ వీడియో యాప్‌‌లకు షిఫ్ట్‌‌ అవ్వడం నెమ్మదిగా జరుగుతోంది. కానీ, లోకల్‌‌ యాప్‌‌లు  షార్ట్‌‌వీడియో మార్కెట్‌‌లో నిలబడగలుగుతాయా? దేశంలో షార్ట్‌‌ వీడియో మార్కెట్‌‌లో  బాగా డబ్బులు పెట్టగలిగే యాప్‌‌లు, సోషల్‌‌ మీడియాలో అనుభవం ఉన్న యాప్‌‌లే చివరికి నిలబడగలుతాయని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. 
లోకల్ యాప్‌‌లు విస్తరిస్తున్నయ్‌‌..
టిక్‌‌టాక్ మార్కెట్ వాటాను లోకల్ యాప్‌‌లు పొందగలుగుతున్నాయని  రెడ్‌‌సీర్‌‌‌‌ పేర్కొంది. aఈ యాప్‌‌ మార్కెట్‌‌ షేరులో 40 శాతం వరకు ఇండియన్ యాప్‌‌లు పొందగలిగాయని తెలిపింది.  టిక్‌‌టాక్ బ్యాన్ కిందటేడాది జూన్ 29 న జరిగింది. ఆ తర్వాత లోకల్ యాప్‌‌లు బాగా విస్తరించాయి. అక్టోబర్‌‌‌‌, 2020 నాటికి జోష్‌‌, ఎంఎక్స్‌‌ టకాటక్‌‌, రొపోస్సో, మోజ్‌‌, మిత్రో, ట్రెల్‌‌, చింగారీ వంటి యాప్‌‌లు సుమారుగా 67 శాతం మార్కెట్‌‌ను షేరును పంచుకున్నాయి. కిందటేడాది జూన్‌‌ నాటికి షార్ట్‌‌ వీడియో మార్కెట్‌‌లో ఇండియన్ యాప్‌‌ల  వాటా కేవలం 4–-6 శాతం మాత్రమే. షార్ట్‌‌ వీడియో మార్కెట్‌‌ 2016 లో 20‌‌‌‌ మిలియన్‌‌ యూజర్లుగానే ఉండేది. కానీ 2020 నాటికి 180 మిలియన్ యూజర్లకు చేరుకుంది. వచ్చే ఐదేళ్లలో ఈ మార్కెట్‌‌ మరింత విస్తరిస్తుందని, ప్రస్తుతం ఉన్న నెలకు 110 బిలియన్ నిమిషాల నుంచి నెలకు 400 బిలియన్ నిమిషాలకు పెరుగుతుందని రెడ్‌‌సీర్‌‌‌‌ రిపోర్ట్ అంచనావేస్తోంది. ఇన్‌‌స్టాగ్రామ్‌‌ రీల్స్‌‌, యూట్యూబ్‌‌ షార్ట్స్‌‌ వంటి వాటికి బలమైన పేరెంట్ కంపెనీలున్నాయి. వీటితో పోటీపడుతూ మరీ ఇండియన్‌‌ యాప్‌‌లు  నిలకడగా మార్కెట్‌‌ షేరు సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పటికే మూడు షార్ట్ వీడియో స్టార్టప్‌‌ కంపెనీలు యూనికార్న్ క్లబ్‌‌లోకి చేరుకున్నాయి. డైలీ హంట్‌‌ (జోష్‌‌) కిందటేడాది నవంబర్‌‌‌‌లో బిలియన్‌‌ డాలర్ వాల్యుయేషన్ కంపెనీగా ఎదిగింది. గూగుల్‌‌, మైక్రోసాఫ్ట్‌‌, ఖతర్ ఇన్వెస్ట్‌‌మెంట్ అథారిటీ, బైట్‌‌ డ్యాన్స్‌‌, గోల్డ్‌‌ మ్యాన్ శాక్స్‌ కంపెనీల నుంచి ఫండ్స్‌‌ సేకరించగలిగింది.  గ్లాన్స్‌‌ఇన్‌‌ మొబి (రొపొస్సో) గూగుల్‌‌, మిత్రిల్‌‌ క్యాపిటల్‌‌ నుంచి ఫండ్స్ సేకరించి యూనికార్న్‌‌ క్లబ్‌‌లో జాయిన్ అయ్యింది. షేర్‌‌‌‌చాట్ (మోజ్‌‌)  టైగర్ గ్లోబల్‌‌,స్నాప్‌‌, ట్విటర్‌‌‌‌, లైట్‌‌ స్పీడ్‌‌ వీపి నుంచి ఫండ్స్ సేకరించి, యూనికార్న్ క్లబ్‌‌లోకి చేరింది. ఈ ఏడాది మార్చిలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా డౌన్‌‌లోడ్ అయిన షార్ట్‌‌ వీడియో యాప్‌‌లలో ఎంఎక్స్‌‌ టకాటక్‌‌, మోజ్‌‌ యాప్‌‌లు ఉండడం విశేషం. మంత్లీ యాక్టివ్ యూజర్లలో కూడా ఈ ఏడాది మార్చిలో మోజ్‌‌, ఎంఎక్స్ టకాటక్‌‌లు టాప్‌‌ లిస్ట్‌‌లో నిలిచాయి.