- సమీపంలోని ప్రైవేట్ స్కూల్ క్లోజ్
- ప్రజలు అటువైపు వెళ్లొద్దన్న అధికారులు
బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బుగ్గ దేవాలయం అటవీ ప్రాంతంలో అడవి పందిపై పెద్దపులి దాడి చేసి హతమార్చడం కలకలం రేపింది. బుగ్గ రాజరాజేశ్వర దేవస్థానానికి వెళ్లే ప్రధాన దారిలో తోకల మల్లేశ్ కు చెందిన పత్తి చేనులో ఈ ఘటర జరిగిందని బెల్లంపల్లి ఎఫ్ఆర్వో పూర్ణ చందర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సతీశ్ తెలిపారు.
రెండు రోజులుగా పెద్దపులి అక్కడే సంచరిస్తుండగా, పత్తి చేనులో పని చేస్తున్న కూలీలు పెద్దపులిని చూసి భయంతో పరుగెత్తారని చెప్పారు. పెద్దపులి సంచారంతో కన్నాల, గాంధీనగర్, లక్ష్మీపూర్ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇదిలాఉంటే కాసిపేట మండలం పెద్దనపల్లి అటవీ ప్రాంతంలోని పెద్దమ్మ తల్లి ఆలయం వైపు పులి వెళ్లినట్లు గుర్తించడంతో ముందు జాగ్రత్తగా కుంట రాములు బస్తీలో ఉన్న శ్రీ చైతన్య హైస్కూల్‌కు అధికారులు సెలవు ప్రకటించారు. 15 మంది ఎనిమల్ ట్రాకర్స్‌తో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పులి కదలికలు గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.