తునికాకు సేకరణకు పులి అడ్డం

  •     పెద్దపులి సంచారం బూచితో తునికాకు సేకరణ నిలిపేసే ప్లాన్
  •     కల్లాల టెండర్లు జరగకుండా సర్కార్​కు నివేదిక పంపిన ఫారెస్ట్ డిపార్ట్​మెంట్
  •     జిల్లాలో సుమారు 30 వేల మంది కూలీల ఉపాధిపై ఎఫెక్ట్

ఆసిఫాబాద్, వెలుగు: అడవిలో పెద్దపులి సంచరిస్తోందని ఫారెస్ట్ ఆఫీసర్లు ఏకంగా ప్రజల ఉపాధి మీద దెబ్బ కొడుతున్నారు. అటవీ ప్రాంతానికి సమీప గ్రామాల ప్రజలు వేసవిలో ఉపాధి కోసం అడవిపై ఆధారపడుతుంటారు. తునికాకు సేకరణ, ఇతర పనులతో వేలాది మంది ఉపాధి పొందుతుంటారు. అయితే ఫారెస్ట్ డిపార్ట్​మెంట్ అనుసరిస్తున్న విధానాలు, వైఖరి పేద కూలీలకు ఉపాధి దొరక్కుండా చేస్తోంది.

అడవుల జిల్లా ఆసిఫాబాద్​లో పెద్దపులి సంచారం ఉందని సాకుతో తునికాకు సేకరణ జరగకుండా అడ్డుపుల్ల వేస్తోంది. జిల్లాలోని దహెగాం, పెంచికల్ పేట్, వాంకిడి మండలాల్లో రేండేళ్ల వ్యవధిలో పులి ముగ్గురిపై దాడి చేసి చంపేసింది. పశువులపై దాడులు జగుతున్నాయి. అయితే, ఇటీవల కాగజ్ నగర్ రేంజ్ లో రెండు పెద్ద పులులు మృతి చెందడం ఫారెస్ట్​ అధికారుల్లో గుబులు రేపింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని విమర్శలు వస్తున్నప్పటికీ.. వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికితోడు ఈ ఎండాకాలం తునికాకు సేకరణ నిలిపి వేయాల్సిందిగా గవర్నమెంట్​కు నివేదిక సమర్పించారు. ఈ వ్యవహారంతో అటవీ అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.

టైగర్ రిజర్వ్​లోనూ లేని నిబంధన

జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్ నగర్ డివిజన్ పరిధిలో 142 కల్లాల్లో ఏటా 20 వేల స్టాండర్ట్ బ్యాగుల తునికాకు సేకరణ జరిగేది. సుమారు రూ.25 వేల కోట్ల ఆదాయం వచ్చేది. 25 వేల నుంచి 30వేల మంది పేదలకు  ఉపాధి దొరికేది. ఈ ఉపాధికి ఫారెస్ట్​ అధికారులు అడ్డం పడుతున్నారు. రాష్ట్రంలో టైగర్ రిజర్వ్​లో సైతం లేని నిబంధన ఆసిఫాబాద్ జిల్లా అధికారులు అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అడవిలోకి ఎవరూ అడుగు పెట్టకుండా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అడవిలో దొరికే ఆకులు, పూలు, పండ్లు సహా ఇతర అటవీ ఉత్పత్తులు పొందేందుకు అడవీ ప్రాంతం వెంట ఉన్న గ్రామాల ప్రజలు, ఆదివాసులకు హక్కు ఉంది.

తునికాకు, ఇప్పపూలు, పరికి, పాల పండ్లు సేకరిస్తూ దశాబ్దాలుగా గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. అయితే ఇప్పుడు పెద్ద పులులకు హాని జరగొద్దని, దీనికితోడు మనుషులపై పులి దాడి చేసే ప్రమాదం ఉందని ఫారెస్ట్ ఆఫీసర్లు తునికాకు సేకరణకు నో చెప్తున్నారు. కేవలం నెల రోజుల పాటు లభించే తునికాకు సేకరణతో వచ్చే ఉపాధితో అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. కానీ ఈ ఉపాధికి అధికారులు గండికొడుతున్నారు.

ఇంకా పూర్తికాని టెండర్లు

ఏటా తునికాకు సేకరణ కోసం జనవరిలో టెండర్లు పిలిచి వాటిని ఖరారు చేసేవారు. ఫిబ్రవరిలో చిన్నచిన్న తునికాకు చెట్లను నరికి, ఆ తర్వాత మార్చి నెలాఖరుకు ఆకు సేకరణ మొదలుపెట్టి ఏప్రిల్, మేలో సేకరణ పూర్తయ్యేది. అయితే ఈ ఏడాది తునికాకు సేకరణ బంద్ చేయాలని ఫారెస్ట్ అధికారులు సర్కారుకు నివేదిక పంపడంతో ఇప్పటివరకు కల్లాలకు టెండర్లు ఖరారు కాలేదు. దీనిపై ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

నిరుపేద గిరిజనులకు ఉపాధి కరువయ్యే పరిస్థితికి కారణమవుతున్న అటవీ శాఖ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. తునికాకు టెండర్లు పూర్తిచెయ్యాలని కోరుతూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి, కలెక్టర్ సహా అటవీ శాఖ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. 30 వేల మంది ఉపాధిపై దెబ్బకొట్టొద్దని, తునికాకుపై బీడీ పరిశ్రమ సైతం ఆధారపడి ఉందని వివరిస్తున్నారు. జిల్లాలో టెండర్లు వెంటనే పిలిచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు. పులి సంచారం ఉన్న అడవీ ప్రాంతం వైపు జనాలు వెళ్లకుండా అధికారులు గస్తీ ఉండి తునికాకు తెంపుకునేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

తునికాకు సేకరణ బంద్ చేయొద్దు

చేనుల్లో పనులు లేక ఎండాకాలంలో తునికాకు సేకరణపై ఆధారపడి జీవనం కొనసాగించే కుటుంబాలు ఏజెన్సీలో అనేకంగా ఉన్నాయి. వ్యవసాయ కూలీలమైన మేము ఆకు సేకరణతో ఏటా ఉపాధి పొందుతున్నాం. ఆకు సేకరణను అడ్డుకోవద్దు. టెండర్లు పిలువాలె.
- జూగ్నక్ దేవురావు, జైనూర్

ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది

జిల్లాలో తునికాకు సేకరణపై గవర్నమెంట్ కు నివేదిక పంపించాం. ప్రభుత్వామే దీన్ని ఫైనల్ చేయాల్సి ఉంది. జిల్లాలోని అడవుల్లో పులులున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నివేదిక అందించాం. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకుంటాం.
- నీరజ్ కుమార్ టిబ్రేవాల్, 
డీఎఫ్ఓ, ఆసిఫాబాద్