
- కాగజ్ నగర్ ఫారెస్ట్‌లోని దరిగాం సమీపంలో ఘటన
కాగజ్ నగర్, వెలుగు : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం దరిగాం అటవి ప్రాంతంలో ఓ పులి మృతి చెందిన విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఊరి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో శనివారం పులి కళేబరాన్ని గ్రామస్తులు గుర్తించి, ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారమిచ్చారు. కాగజ్‌నగర్ ఎఫ్ డీఓ, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న పులి కళేబరాన్ని పరిశీలించారు.
రెండు పులుల కొట్లాటల్లో తీవ్ర గాయాలై ఒక పులి మృతి చెంది ఉంటుందని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. విషాహారం తిని కూడా పులి చనిపోయి ఉండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. పులి కళేబరాన్ని అధికారులు దహనం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాగజ్ నగర్ ఎఫ్డీఓ వేణు, ఇతర అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.