జనావాసాల్లో పులుల కలకలం.. ములుగు జిల్లా ప‌బ్లిక్ జ‌ర జాగ్ర‌త్త‌..!

జనావాసాల్లో పులుల కలకలం.. ములుగు జిల్లా ప‌బ్లిక్ జ‌ర జాగ్ర‌త్త‌..!
  • ఈసారి ములుగు జిల్లా బోదాపురం శివార్లలో ప్రత్యక్షం
  • హేమాచల క్షేత్రం పరిసరాల్లోనూ సంచారం
  • కాగజ్ నగర్  ఫారెస్ట్  డివిజన్​లోని హుడ్కులిలో దూడపై దాడి

వెంకటాపురం/ మంగపేట/ కాగజ్​నగర్​, వెలుగు: జనావాసాల్లోకి మళ్లీ పులులు రావడం కలకలం రేపుతున్నది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం భోదాపురం శివారులోని గోదావరి పరివాహక ప్రాంతంలో కొందరు రైతులకు సోమవారం రాత్రి పులి కనిపించింది. రైతులు తాము సాగు చేస్తున్న వాటర్ ​మెలన్​ తోటలో రాత్రి కాపలా కోసం వెళ్లగా.. అర్ధరాత్రి వాళ్ల గుడిసె సమీపంలో పులి గాండ్రింపు వినిపించింది. వెంటనే టార్చ్ లైట్  వేసి చూడగా పెద్ద పులి కనిపించింది. ఈ విషయాన్ని మంగళవారం అటవీ శాఖ అధికారుల దృష్టికి తెచ్చారు.

పులి సంచారాన్ని అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. బోదాపురం గ్రామ శివారులోని గోదావరి నది వద్ద పులి పాదముద్రలు గుర్తించామని ఎఫ్ఆర్వో చంద్రమౌళి తెలిపారు. పులి ఒంటరిగానే సంచరిస్తున్నదని.. దాని పాదముద్రలు 5 ఇంచులు ఉన్నాయని చెప్పారు. ఆ పులికి ఆరు నుంచి ఏడేండ్ల వయసు ఉంటుందన్నారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవుల్లో పులులు లేవని.. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. సమీప గ్రామాల్లో పెట్రోలింగ్  చేయిస్తున్నామని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హేమాచల క్షేత్రం పరిసరాల్లో..

ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామ సమీపంలోని హేమాచల క్షేత్రం పరిసరాల్లోనూ పులి తిరిగినట్లు ఆనవాళ్లు కనిపించడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామం సమీపంలో గోదావరి నది దాటి, మంగపేట మండలం చుంచుపల్లి దగ్గర గోదావరి దాటి హేమాచల క్షేత్రం వైపు వెళ్లినట్లు పులి కాలి ముద్రలు ఉన్నాయని ఇన్​చార్జి ఎఫ్ఆర్వో మంగలంపల్లి అశోక్ కుమార్  తెలిపారు. విషయం తెలుసుకున్న మంగపేట ఎస్సై టీవీఆర్  సూరి.. మల్లూరు, చుంచుపల్లి, నీలాద్రి పేట, రాజుపేట, బాలన్నగూడెం, ప్రాజెక్టు నగర్, పూరేడుపల్లి గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ డప్పు చాటింపు వేయించారు. 

కుమ్రంభీం జిల్లాలో దూడపై దాడి 

కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్ నగర్  ఫారెస్ట్  డివిజన్​లో పులి భయం వీడడం లేదు. మంగళవారం తెల్లవారుజామున సిర్పూర్(టి) మండలం హుడ్కులిలో ధంద్రే రావుజీ ఇంటి వద్ద కట్టేసి ఉన్న దూడపై పులి దాడి చేసింది. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్  ఆఫీసర్లు, సిబ్బంది అక్కడికి  చేరుకొని పరిశీలించారు. కాగజ్ నగర్  ఎఫ్డీవో వినయ్ కుమార్  సాహు.. దాడి చేసింది పులేనని నిర్ధారించారు. గాయపడ్డ లేగ దూడను సిర్పూర్(టి) వెటర్నరీ హాస్పిటల్ కు తీసుకెళ్లి ట్రీట్​మెంట్ అందించారు. కౌటాల మండలం తలోడి గ్రామ శివారులో మేకపై దాడి జరిగింది. పులి దాడి చేసి ఉంటుందని స్థానికులు అనుమానించగా.. తోడేలు దాడి చేసి ఉంటుందని ఫారెస్టు ఆఫీసర్లు చెప్తున్నారు.